PM Modi On Naveen Patnaik Health Condition : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంపై ఓ ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణత వెనుక కుట్ర జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నవీన్ పట్నాయక్ సన్నిహితుడు, తమిళనాడుకు చెందిన వీకే పాండియన్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ, రాష్ట్రానికి ఒడిశా ముఖ్యమంత్రే కావాలని ప్రజలు అనుకుంటున్నారన్నారు. అందుకే 25 ఏళ్ల బీజేడీ పాలనను అంతం చేయాలని నిర్ణయించుకున్నారని మోదీ తెలిపారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, 10ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 11స్థానం నుంచి 5స్థానానికి వెళ్లిందన్నారు.
"ప్రస్తుతం నవీన్ బాబు సన్నిహితులు అందరూ ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. గతేడాది కాలంలో ఆయన ఆరోగ్యం ఎంతలా క్షీణించిందో చూసి బాధపడుతున్నారు. ఆయనకు సన్నిహితంగా ఉండేవారు ఎవరైనా నన్ను కలిస్తే తప్పకుండా నవీన్ ఆరోగ్యం గురించి మాట్లాడుతారు. ఆయన తన పనులను తాను చేసుకోలేకపోతున్నారని చెప్పారు. ఆయన ఆరోగ్య క్షీణత వెనుక కుట్ర జరిగి ఉండొచ్చని ఆయన సన్నిహితులు నా దగ్గర వాపోయారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వెనుక ఏదైనా కుట్ర జరిగిందా? ఆయన ఆరోగ్యం క్షీణించడానికి కారణమైన వారే ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ప్రస్తుతం జరుగుతున్న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే, దీనిపై ఓ ప్రత్యేక కమిటీని నియమించి దర్యాప్తు చేస్తాం.
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'ప్రధాని నాకు ఫోన్ చేయాల్సింది'
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. ఒకవేళ ప్రధానికి తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే, తనకు ఫోన్ చేసి పరామర్శించి ఉండాల్సిందని అన్నారు. బీజేపీలో తన ఆరోగ్యం గురించి వదంతులు వ్యాపించే వారు చాలా మంది ఉన్నారని విమర్శించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, గత నెల రోజులుగా రాష్ట్రంలోనే ప్రచారం చేస్తున్నానని తెలిపారు.
'ఓబీసీ హక్కులను ముస్లింలకు'- టీఎంసీపై మోదీ ఫైర్
బంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం నకిలీ కుల ధ్రువీకరణపత్రాల ద్వారా అసలైన ఓబీసీ హక్కులను ముస్లింలకు కట్టబెడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. వాటిని కలకత్తా హైకోర్టు రద్దు చేసినా, టీఎంసీ ఆ తీర్పును అంగీకరించటం లేదని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బంగాల్‌లోని కక్‌ద్వీప్ బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఓ వర్గాన్ని బుజ్జగించేందుకు టీఎంసీ ప్రభుత్వం బహిరంగంగానే రాజ్యాంగంపై దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. అంతేకాకుండా నకిలీ కులధ్రువపత్రాల విషయంలో టీఎంసీ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
"బంగాల్ యువతకు లభించాల్సిన అవకాశాలను చొరబాటుదారులు లాక్కుంటున్నారు. మీ ఆస్తిపాస్తులను వారు కబ్జా చేస్తున్నారు. బంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా లెక్కలు మారిపోవటంపై దేశమంతా చింతిస్తోంది. ప్రతిపక్షాలు సీఏఏను వ్యతిరేకించటం, సీఏఏపై అసత్యాలు చెప్పటం సహా తప్పుడు ప్రచారం ఎందుకు చేశారంటే బంగాల్‌లో చొరబాటుదారులను రక్షించాల్సి ఉంది. హిందూ శరణార్థులు, మథువా శరణార్థులను టీఎంసీ బంగాల్‌లో ఉండనివ్వకూడదని అనుకుంటోంది. కానీ మీరు (హిందూ శరణార్థులు) చింతించవద్దు. జూన్ 4వ తేదీ తర్వాత టీఎంసీ నేతల పని అయిపోతుంది." అని మోదీ అన్నారు.
48గంటలు పాటు ప్రధాని మోదీ 'నాన్‌స్టాప్ మెడిటేషన్'- కారణం అదే! - Pm modi kanyakumari