Instant Pani Puri Water Powder Recipe : "పానీపూరి".. ఈ పేరు చెప్పగానే మనలో చాలా మందికి నోరూరిపోతుంటుంది. ఇక బయట చాట్ బండి కనిపిస్తే.. ఎక్కువ మంది తినకుండా ఉండలేరు. అయితే.. బయట బండి మీద పానీపూరీ అమ్మేవారు సరిగా శుభ్రత పాటించరనే అనుమానాలు ఉంటాయి. అందుకే.. చాలా మంది తినడానికి జంకుతారు. ఆ ఘుమఘుమల సువాసన చూస్తేనేమో తినకుండా ఉండలేరు. పోనీ.. ఇంట్లో తయారు చేసుకోవాలంటే.. అదో పెద్ద ప్రాసెస్ అనుకొని ఆగిపోతారు. ఇలాంటి వారికోసమే సింపుల్ చిట్కాతో వచ్చాం. అదేంటో ఇప్పుడు చూద్దాం.
చాట్ కాకుండా కేవలం పానీ పూరీని నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. పూరీలు ఇప్పుడు మార్కెట్‌లో ఇన్‌స్టంట్ గా లభిస్తున్నాయి. పూరీలను ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇవి అన్ని చోట్లా దొరుకుతున్నాయి. ఇక కావాల్సింది అందులోకి పానీ తయారు చేసుకోవడం. ప్రతిసారీ పానీ తయారు చేసుకోవడం కొంచెం కష్టమైన పనే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే.. ఒకేసారి పానీ పూరీ పౌడర్ రెడీ చేసి.. స్టోర్ చేసుకుంటాం. ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడంటే.. అప్పుడు వేడివేడిగా పానీపూరి తినేయొచ్చు. మరి.. ఆ పానీ పౌడర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
పానీ పూరీ వాటర్ పౌడర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :
- ఎండిన పుదీనా ఆకుల పొడి - రెండున్నర టేబుల్ స్పూన్లు
- వేయించిన జీలకర్ర పొడి - 2 టేబుల్ స్పూన్లు
- మిరియాల పొడి- టేబుల్ స్పూన్
- సైంధవ లవణం- టేబుల్ స్పూన్
- ధనియాల పొడి- టేబుల్ స్పూన్
- శొంఠి పొడి-అర టేబుల్ స్పూన్
- ఆమ్‌చూర్ పౌడర్-అర టేబుల్ స్పూన్
- పంచదార-అర టేబుల్ స్పూన్
- ఇంగువ-కాస్త
- సిట్రిక్ యాసిడ్ క్రిస్టల్స్-చిటికెడు
వీటన్నింటినీ ఒక మిక్సీ జార్‌లో వేసి బరకగా లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే నోరూరించే పానీపూరికి కావాల్సిన పానీ మసాలా పౌడర్ రెడీ అయిపోయినట్లే. దీనిని తడి లేని సీసాలో భద్రం చేసుకుంటే పానీపూరీ తినాలనిపించినప్పుడు కప్పు నీళ్లల్లో అర చెంచా చొప్పున కలిపితే సరిపోతుంది. పానీపూరికి కావాల్సిన వాటర్ రెడీ అయినట్లే..! ఇంతే.. ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఆ పొడితో పానీ తయారు చేసుకొని, ఇన్‌స్టంట్ పూరీలు కొని తెచ్చుకొని ఇష్టంగా లాంగిచేయొచ్చు.
రాష్ట్రానికో పేరు..
ఈ పానీపూరి మన దగ్గరే కాదు.. దేశవ్యాప్తంగా ఈ ఐటమ్ చాలా పేమస్. అయితే.. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు. పానీపూరిని ఎక్కడ ఏ పేరుతో పిలుస్తారో మీకు తెలుసా? ఇప్పుడు చుద్దాం.
- మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో- పానీపూరి
- పశ్చిమ బెంగాల్, అస్సాంలో- పుచ్కా
- దిల్లీ, పంజాబ్, జమ్ముకశ్మీర్, హరియాణా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో- గోల్ గప్ప
- గుజరాత్, మధ్యప్రదేశ్‌లో కొన్ని చోట్ల- పకోడీ అని కూడా పిలుస్తారు.
- హరియాణాలో కొన్ని ప్రాంతాల్లో- పానీ కె పతాషె అంటారు
- రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్- పతాషి/ పానీ కె పతాషి
- తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశాలో - గప్‌చుప్
- తూర్పు ఉత్తర్‌ప్రదేశ్- ఫుల్కీ
- హొషంగాబాద్ (మధ్యప్రదేశ్)- టిక్కీ
- అలీగఢ్ (ఉత్తర్‌ప్రదేశ్)- పడాకా
ఇవి కూడా చదవండి :
పానీపూరీ బయట తింటే సకల రోగాలు - చక్కగా ఇలా ఇంట్లో చేసుకోండి! - అదే టేస్ట్, సూపర్ క్వాలిటీ!
IAS కావాలనుకొని 'BTech పానీపూరివాలా'గా- యువతి సక్సెస్ స్టోరీ అదుర్స్