Indian Loco Pilot Trolley Bag: రైల్వే లోకో పైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువులు, అధికారిక సామగ్రిని ఇనుప ట్రంక్‌లో తీసుకెళ్లాల్లిన అవసరం లేదు. ట్రంక్కు బదులుగా ట్రాలీ బ్యాగులో వాటిని తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు లోకో పైలట్లు, గార్డులకు ట్రాలీ బ్యాగులను అందించాలని రైల్వే బోర్డు దేశంలోని అన్ని రైల్వే జోన్లకు జులై 19న లేఖ రాసింది. ఈ విధానపరమైన నిర్ణయాన్ని అమలు చేయాలని కోరింది.
18ఏళ్ల కిందటే ప్రతిపాదన
కాగా, లోకో పైలట్లు, గార్డులకు ట్రాలీ బ్యాగులను అందించాలని 2006లో అంటే 18 ఏళ్ల కిందటే రైల్వే శాఖ భావించింది. ఏడాది తర్వాత ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు కార్మిక సంఘాలతో చర్చించింది. అనంతరం మార్గదర్శకాలను విడుదల చేసింది. రైల్వే శాఖ నిర్ణయంపై లోకో పైలట్లు, గార్డుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో మరో 11 ఏళ్లపాటు ఈ నిర్ణయం పెండింగ్‌లో ఉండిపోయింది.
2018లో మరోసారి రైల్వే శాఖ గార్డులు, లోకోపైలట్లకు ట్రాలీ బ్యాగులను అందించాలని నిర్ణయించింది. ఉత్తర రైల్వే, దక్షిణ మధ్య రైల్వే జోన్లో ట్రయల్ నిర్వహించింది. ఈ ట్రయల్స్ నుంచి సానుకూల స్పందన రావడం వల్ల 2022 ఫిబ్రవరి 21న ఒక ఉత్తర్వును జారీ చేసింది. 'లోకో పైలట్లు, గార్డులకు ఇనుప ట్రంక్కు బదులుగా ట్రాలీ బ్యాగ్‌లను అందించవచ్చు. సిబ్బంది స్వయంగా ట్రాలీ బ్యాగులను కొనుగోలు చేస్తే వారికి ప్రతి 3ఏళ్లకు రూ.5వేలు ఇవ్వాలి. కావాల్సిన వారికి రైల్వే శాఖనే ట్రాలీ బ్యాగులను అందిస్తుంది. ట్రాలీ బ్యాగ్ బరువును తగ్గించడానికి రైల్వే నియమాలు, మాన్యువల్ సాఫ్ట్ కాపీలను ఉద్యోగులకు అందించాలి' అని ఉత్తర్వులో స్పష్టం చేసింది.
సవాల్ చేసిన ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్
అయితే రైల్వే శాఖ ఇచ్చిన ఈ ఉత్తర్వును ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్ తీవ్రంగా వ్యతిరేకించింది. దిల్లీలోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) ప్రిన్సిపల్ బెంచ్ సహా వివిధ చట్టపరమైన వేదికల్లో రైల్వే శాఖ ఉత్తర్వును సవాల్ చేసింది. రైల్వే శాఖ ఉత్తర్వును నిలిపివేయాలని కోరింది. ఈ ఉత్తర్వు ఏకపక్షమని, రైల్వే గార్డులకు బాక్స్ బాయ్స్ విధులను విధిస్తోందని ఆరోపించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఇండియా గార్డ్స్ కౌన్సిల్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో రైల్వే శాఖ గార్డులు, లోకో పైలట్లకు ఇనుప ట్రంక్కు బదులుగా ట్రాలీ బ్యాగులను అందించడంపై నిర్ణయం తీసుకుంది.
డ్యూటీకి వెళ్లేటప్పుడు గార్డులు, లోకో పైలట్లు తమ వ్యక్తిగత వస్తువులు, అధికారిక సామగ్రిని తీసుకెళ్లేందుకు ఇనుప ట్రంక్లను వాడుతారు. వీటిని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అందిస్తుంది. 'విధుల సమయంలో వివిధ ప్రదేశాలకు తిరిగేటప్పుడు ఇనుప ట్రంప్ సురక్షితంగా ఉంటుంది. దానిని ఇతరులు తీసుకెళ్లడం కష్టం. అదే ట్రాలీ బ్యాగులను అయితే ఈజీగా తీసుకెళ్లిపోతారు' అని ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్ పీ సింగ్ తెలిపారు.