India Myanmar Border Fencing : భారత్- మయన్మార్‌ల సరిహద్దులో మొత్తం 1,643 కిలోమీటర్ల మేర కంచెను నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. పటిష్ఠమైన నిఘాను మరింత సులభతరం చేసేందుకుగానూ సరిహద్దులో గస్తీ మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. అభేద్యమైన సరిహద్దుల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
మణిపుర్‌లో 20కి.మీల ఫెన్సింగ్
'ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దును పూర్తిగా కవర్ చేస్తూ 1,643 కిలోమీటర్ల పొడవునా ఫెన్సింగ్‌ను నిర్మించాలని నిర్ణయించాం. ఇప్పటికే మణిపుర్‌లోని మోరేలో 10కి.మీల మేర కంచెను నిర్మించాం. హైబ్రిడ్ నిఘా వ్యవస్థ ద్వారా మణిపుర్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కిలోమీటరు చొప్పున కంచె ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. మణిపుర్‌లో సుమారు 20కి.మీల మేర ఫెన్సింగ్ పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా ఇప్పటికే ఆమోదం లభించింది. త్వరలోనే అవి ప్రారంభమవుతాయి' అని అమిత్ షా తెలిపారు.
4 రాష్ట్రాలతో మయన్మార్ సరిహద్దు
ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, నాగాలాండ్, మిజోరం మయన్మార్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇప్పటివరకు సరిహద్దు నుంచి రెండువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే ఆ దేశం నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు జరుగుతున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. మణిపుర్ సంక్షోభం, మయన్మార్‌లో అంతర్యుద్ధంతో పరిస్థితులు ప్రభావితమయ్యాయి. ఇలాంటివి కట్టడి చేసేందుకే ఆ దేశ సరిహద్దు వెంబడి కంచెను నిర్మిస్తామని అమిత్ షా ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు.
స్వాగతించిన అసోం సీఎం
భారత్-మయన్మార్ సరిహద్దులో కంచెను నిర్మిస్తామన్న హోంమంత్రి ప్రకటనపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. దీనిని ఓ సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించారు. 'కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. బోర్డర్లో ఫెన్సింగ్ నిర్మాణం అనేది ఈశాన్య ప్రాంతంపై భారీ ప్రభావాన్ని చూపనుంది' అని అసోం సీఎం ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఫిబ్రవరి 10 వరకు బడ్జెట్ సమావేశాలు
ఇదిలాఉంటే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఒక రోజు పొడిగిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. జనవరి 31న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఈనెల 9వరకు జరగాల్సి ఉంది. కాగా, మంత్రి తాజా ప్రకటనతో ఫిబ్రవరి 10 వరకు సమావేశాలు జరగనున్నాయి.
'పీఎం కిసాన్ నిధుల పెంపు'- పార్లమెంట్లో మోదీ సర్కార్ క్లారిటీ
శరద్ పవార్‌కు షాక్- అజిత్ వర్గానిదే అసలైన NCP- వర్గపోరుకు ఈసీ పరిష్కారం