HUL Drops Health Label from Horlicks : దేశంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు బాగా ఇష్టపడే ప్రముఖ బ్రాండ్ హార్లిక్స్ లేబుల్‌ను మారుస్తూ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో హెల్త్ ఫుడ్ డ్రింక్స్ కేటగిరిలో ఉన్న హార్లిక్స్‌ను ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ కేటగిరిలోకి మార్చింది. హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి డ్రింక్స్, పానియాలను తొలగించాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) రితేష్ తివారీ మాట్లాడుతూ, హార్లిక్స్ ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్(ఎఫ్‌ఎన్‌డీ) లేబుల్‌కు మారడం ఉత్పత్తిని మరింత కచ్చితంగా, పారదర్శకంగా వర్గీకరించేందుకు సులభతరం అవుతందని అన్నారు.
తప్పుదారి పట్టించేలా ఉడడం వల్లే
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల్లో డైరీ ఉత్పత్తులను లేబులింగ్ చేయకూడదని తెలిపింది. తృణధాన్యాలతో కూడిన పాల ఉత్పత్తులు, ఆరెంజ్, లైమ్ వంటి ఫ్లేవర్లతో కూడిన ఆరోగ్య పానీయాల కేటగిరీలు వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని తెలిపింది. ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసిందని ఈటీవీ భారత్‌తో మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ డాక్టర్ జగదీష్ ప్రసాద్ తెలిపారు. పలు కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఇంకా అనేక మార్గాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఇటీవలె బోర్నవిటా సైతం
బోర్న్‌విటా వంటి పానీయాలను కూడా హెల్త్ డ్రింక్స్ అని లేబుల్ చేయరాదని ప్రభుత్వం ఇటీవల ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లకు సూచించింది. దేశ ఆహార చట్టాల్లో ఆ కేటగిరికి సరైన నిర్వచనం లేదని తెలిపింది. దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్యాడ్‌బరీ బోర్న్‌విటాలో అధిక చక్కెర కంటెంట్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి.
ఇంకా చాలానే
భారత్‌లోని పానియాలు, సుగంధ ద్రవ్యాలు, మసాలాలు విదేశాల్లో నిషేధానికి గురవతున్నాయి. వీటిని విదేశాలు చాలా నిశితంగా పరీక్షిస్తున్నాయి. మసాలా మిశ్రమాల్లో క్యాన్సర్ కారక పెస్టిసైడ్ ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు ఇటీవల ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రముఖ మసాల బ్రాండ్లు MDH, ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయాలను హాంకాంగ్ నిషేధించింది. ఎవరెస్ట్ మసాలాల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనుమతి పొందిన దాని కంటే ఎక్కువ ఉందని ఆరోపిస్తూ సింగపూర్ కూడా నిషేధం విధించింది.
ఇటీవల స్విస్ పరిశోధనా సంస్థ పబ్లిక్ ఐ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో విక్రయించిన నెస్లే బేబీ ఫుడ్ ఐటెమ్‌ల నమూనాలను పరీక్ష కోసం బెల్జియం ప్రయోగశాలకు పంపింది. ఈ పరిశోధనల ప్రకారం నెస్లే భారతదేశంతో సహా తక్కువ సంపన్న దేశాల్లో విక్రయించే శిశువుల పాలలో చక్కెరను కలుపుతుందని తేలింది. కానీ యూరప్, యూకేల్లో ఎలాంటి చెక్కర కలపడం లేదని ఈ పరిశోధనలో వెల్లడైంది. దేశీయ మార్కెట్లో లభ్యమయ్యే అన్ని పానీయాలు, సుగంధ ద్రవ్యాలు, మసాలల ఉత్పత్తుల తయారీకి ప్రామాణిక విధానాలను అనుసరిస్తున్నారా లేదా అని నిర్ధారించడానికి చర్యలు ప్రారంభమైనట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు ఈటీవీ భారత్‌కు తెలిపారు. ఎవరైనా ప్రామాణిక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఇకపై రూ.20కే భోజనం- మెనూ ఇదే! - railway food price in train