Home Made Boondi Laddu Recipe Making: నోట్లో వేసుకుంటే కరిగిపోయే బూందీ లడ్డూ అంటే ఎంతో మందికి ఇష్టం. హ్యాపీ అకేషన్ ఏదైనా ఇది ఉండాల్సిందే. అంతేనా పెళ్లి భోజనాల్లో సైతం ఇది ఉండాల్సిందే. అయితే చాలా మందికి బూందీ లడ్డూను ఇంట్లో చేయడం రాదు. చేసినా అంతగా కుదరదు. కాబట్టి.. తినాలనిపించినప్పుడల్లా, అవసరం ఉన్నప్పుడల్లా స్వీట్ షాప్‌కి వెళ్లి తెచ్చుకుంటుంటారు. అయితే ఇప్పుడా అవసరం లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్ కొలతలతో ఈ టిప్స్ పాటిస్తూ ఇంట్లో చేస్తే లడ్డూ టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. మరి, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
బూందీ లడ్డూకు కావాల్సిన పదార్థాలు:
- శనగ పిండి - 1 కేజీ
- నీరు - తగినంత
- నూనె - వేయించడానికి సరిపడా
పాకం కోసం:
- పంచదార - 1కేజీ
- నీరు - 700 ml
- యాలకుల పొడి - 1 టీస్పూన్
- నిమ్మరసం - నాలుగు చుక్కలు
డ్రై ఫ్రూట్స్:
- జీడిపప్పు - 100 గ్రాములు
- ఎండు ద్రాక్ష - 50 గ్రాములు
- పచ్చకర్పూరం - చిటికెడు
ముంబయి స్ట్రీట్ స్టైల్ 'పావ్‌భాజీ' - ఇలా చేస్తే నిమిషాల్లోనే ప్రిపేర్! - పైగా టేస్ట్ సూపర్!
తయారీ విధానం:
- ముందుగా శనగపిండిని జల్లించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని జల్లించిన శనగపిండి వేసుకుని నీళ్లు కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా దోశ పిండి కన్నా కొంచెం జారుడుగా ఓ మూడు నిమిషాల పాటు కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి బాండీ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు మరో స్టౌ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని పంచదార వేసి నీళ్లు పోసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత దానిపై ఏమైనా మలినాలు ఉంటే తీసేసి.. ఒక తీగ పాకం వచ్చే వరకు మరిగించుకుని ఆపై యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అందులో నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకుంటే పాకం గట్టిపడకుండా ఉంటుంది.
- ఇప్పుడు మరుగుతున్న నూనెకి దగ్గరగా బూందీ గరిటె పెట్టి కలిపిన శనగపిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోసుకుంటూ గరిటెతో చిన్నగా తిప్పుతుంటే బూందీ నూనెలోకి పడుతుంటుంది.
- అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే శనగపిండిని ఎక్కువ మొత్తంలో బూందీ గరిటెలో వేసుకుంటే పిండి ముద్దలు ముద్దలుగా పడుతుంది. కాబట్టి కొద్దికొద్దిగా వేసుకుంటూ చేసుకోవాలి.
- ఇప్పుడు బూందీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకుని తీసి వేడి వేడి పంచదార పాకంలో పోసి కలుపుకోవాలి. అయితే ఇక్కడ బూందీని ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు.
క్రిస్పీ అండ్ స్పైసీ సేమియా వెజ్ కట్లెట్స్ - ఇలా చేశారంటే మమ్మీ ఇట్స్ టూ యమ్మీ అనడం పక్కా! -
- ఇప్పుడు పిండి మొత్తాన్ని ఈ విధంగానే చేసుకుని పంచదార పాకంలో వేసుకుని కలుపుకోవాలి.
- ఇప్పుడు మరుగుతున్న నూనెలోనే జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకుని బూందీ లడ్డూ మిశ్రమంలో కలుపుకోవాలి. అలాగే అందులోకి పచ్చ కర్పూరం కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఓ పది నిమిషాలు ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు పది నిమిషాల తర్వాత బూందీ లడ్డూ మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఒక టీస్పూన్ నెయ్యి వేసి కలుపుకుని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా మిశ్రమం మొత్తాన్ని లడ్డూల్లా చేసుకోవాలి.
- ఇప్పుడు వీటన్నింటినీ ఓ గంట పాటు పక్కకు పెట్టుకోవాలి. గంట తర్వాత వాటిని గాలి చొరబడని డబ్బాల్లో పెట్టుకుంటే సరి.
- ఎంతో రుచిగా ఉండే బూందీ లడ్డూ రెడీ. అయితే బూందీ లడ్డూ పర్ఫెక్ట్గా రావాలంటే కచ్చితంగా తీగ పాకం రావాలి.
పది నిమిషాల్లో పసందైన పచ్చి పులుసు - చాలా మందికి తెలియని టిప్స్!