Holi Colors Preparation In Home : రంగుల పండుగ హోలీ వచ్చేస్తోంది. దేశం మొత్తం ఈ పండుగను ఘనంగా జరుపుకొంటుంది. అయితే ఈ సందర్భంగా ఉపయోగించే రంగులతోనే వస్తుంది అసలు సమస్య. ఎందుకంటే వాటిలో కలిపే రసాయనాలు మన శరీరానికి హానీ కలిగిస్తాయి. ఒకప్పుడు హోలీ రంగులు వసంతకాలంలో వికసించే ప్రకాశవంతమైన పువ్వులను ఉపయోగించి తయారు చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు సహజ రంగులు బదులుగా రసాయనాలు కలిపినవి వాడటం మొదలైంది. ఇవి పెద్ద కష్టం లేకుండా కొనుక్కొని వాడుకోవటానికి అనువుగా ఉంటాయేమో కానీ ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగిస్తాయి. కాబట్టి ఈసారి సహజసిద్ధమైన ఇంట్లో తయారుచేసిన రంగులతో ఆడుకోవడం ద్వారా మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని, పర్యావరణాన్ని మీరు రక్షించుకోవచ్చు అదెలా అంటే.
ఎరుపు రంగు లేకుండా హోలీ లేదనే చెప్పొచ్చు. కచ్చితంగా హోలీలో ఈ రంగును వాడుతారు. దీన్ని ఇంట్లో తయారు చేయడానికి పసుపుతో నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా వెంటిలేషన్ ఉన్న గదిలో ఆరబెట్టండి. లేదంటే ఎరుపు రంగు కోసం ఎండబెట్టిన ఎర్ర మందార పువ్వులపొడి కూడా వాడుకోవచ్చు. చేయడానికి కాస్త టైమ్ పట్టినా కూడా చాలా బాగుంటుంది. మీరు దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టి, ఎరుపు రంగు కోసం ఉపయోగించవచ్చు.
- పింక్ కలర్ కోసం అయితే పసుపులో నిమ్మ రసాన్ని తక్కువ మోతాదులో కలిపితే చాలు.
- మేజెంటా రంగు అంటే ముదురు గులాబీ రంగు కోసం బీట్‌రూట్ ముక్కలు లేదా ఎర్ర ఉల్లిపాయలను ఉడకబెట్టి, వడకట్టి, ఆ నీటిని చల్లబరచి వాడటమే.
- బ్రౌన్ కలర్ నీళ్ల కోసం కాఫీ పౌడర్‌ను నీటిలో వేసి మరిగించండి. అయితే మరీ ఘాడమైన వాసన ఉండకూడదు అనుకుంటే అందులో రోజ్ వాటర్ కలపండి. బట్టలమీద పడే కాఫీ మరకలు పోవని మాత్రం గుర్తు పెట్టుకోండి.
- ఊదారంగు కోసం నల్ల క్యారెట్లను గ్రైండ్ చేసి, మొక్కజొన్న పిండితో కలపండి. సువాసన కోసం దానికి రోజ్ వాటర్ జోడించండి.
- బూడిద రంగు కోసం మొక్కజొన్న పిండితో కలిపి ఎండబెట్టిన ఉసిరిక పొడిని ఉపయోగించండి.
- ఆకుపచ్చ రంగు కోసం గోరింట పొడిని బియ్యప్పిండి లేదా మైదాతో కలపండి లేదా నీటిలో కూడా కలుపుకొని వాడచ్చు. అయితే మరకలు రాకుండా మాత్రం జాగ్రత్త పడండి.