- 3.04PM
హిమాచల్‌ప్రదేశ్ రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ధనబలం, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి బీజేపీ ప్రజల ఆదేశాన్ని అణిచివేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు సాధారణ ప్రజలకు ఉందని ఆమె చెప్పారు. 'హిమాచల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్పష్టమైన మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. కానీ బీజేపీ ధనబలం, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా హిమాచల్ ప్రజల హక్కును అణిచివేయాలని చూస్తోంది. 25 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ 43 మంది ఎమ్మెల్యేల మెజారిటీని సవాలు చేస్తుంది. బీజేపీ వైఖరి అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారు.' అని ప్రియాంక గాంధీ అన్నారు.
'కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడం దురదృష్టకరం'
హిమాచల్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ నేతలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడం దురదృష్టకరమని అన్నారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్. ప్రస్తుతం తమ పార్టీ ప్రాధాన్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడమేనని తెలిపారు. ' హిమాచల్‌లో క్రాస్ ఓటింగ్‌పై మా పరిశీలకులు అధిష్ఠానానికి నివేదిక సమర్పిస్తారు. 2022 డిసెంబర్లో హిమాచల్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అనురాగ్ ఠాకుర్, జైరామ్ ఠాకుర్‌లను తిరస్కరించారు. మోదీ ప్రభుత్వానిది ఒక్కటే హామీ. అదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టడం.' అని జైరాం రమేశ్ తెలిపారు.
- 2.00PM
తాను రాజీనామా చేశానని వస్తున్న వార్తలు అవాస్తవమని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు స్పష్టం చేశారు. తాను రాజీనామా చేయలేదని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో తమ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు ఐదేళ్లు పూర్తి చేసుకుంటుందని తెలిపారు.
- 11.50 AM
మరోవైపు, అసెంబ్లీ నుంచి 15 మంది విపక్ష ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. బుధవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా- వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో 15 మంది ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. వీరిలో శాసనసభ ప్రతిపక్ష నేత జైరాం ఠాకుర్ కూడా ఉన్నారు. అనుచిత ప్రవర్తన కారణంగానే వారిని సస్పెండ్ చేసినట్లు సభాపతి తెలిపారు. అనంతరం సభను వాయిదా వేశారు.
- 11.21 AM
హిమాచల్ ప్రదేశ్‌లోని రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హరియాణా నుంచి హెలికాఫ్టర్‌లో అజ్ఞాత ప్రదేశానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి ఓ హోటల్లో బస చేసిన రాజిందర్ రాణా, రవి ఠాకూర్ సహా మిగతా శాసనసభ్యులు బుధవారం ఉదయం పంచకులా నుంచి బయలుదేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, హిమాచల్ అసెంబ్లీ స్పీకర్ 14 మంది బీజేపీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ విధించారు.
- 11.04 AM
హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌ను గద్దె దించి త్వరలోనే తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నాయకుడు హర్ష్ మహాజన్ తెలిపారు. అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అతి త్వరలోనే ప్రభుత్వ మార్పు జరగబోతోందని చెప్పారు.
"రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. నాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఫోన్‌లు వచ్చాయి. మరికొద్ది గంటల్లో పరిస్థితి మారనుంది. త్వరలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. రాబోయే 10-20 ఏళ్ల వరకు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాబోదు. రాష్ట్రంలో బీజేపీ గేమ్ ఛేంజర్- సుఖు ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్ నేతలంతా బీజేపీలో చేరుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ మెజారిటీ కోల్పోయింది. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు" అని హర్ష్ మహాజన్ తెలిపారు
విక్రమాదిత్య సింగ్ రాజీనామా
మరోవైపు, కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ మంత్రి విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. "రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నేను ప్రభుత్వంలో భాగంగా కొనసాగడం సరికాదని చెప్పదలుచుకుంటున్నా. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. నేను నా అనుచరులతో సంప్రదింపులు జరిపి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా. గత రెండు-మూడు రోజుల్లో రాష్ట్రంలో జరిగినవి ఆందోళన కలిగించే విషయాలే" అని విక్రమాదిత్య సింగ్ తెలిపారు.
"2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం వీరభద్ర సింగ్ పేరు ఉపయోగించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది వాస్తవం. అందరి సహకారంతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. ఏడాది పాలన పూర్తయింది. ప్రభుత్వ పనితీరు గురించి నేనెప్పుడూ చెప్పలేదు. కానీ ఈరోజు స్పష్టంగా చెప్పడం నా బాధ్యత. నాకు పదవి ముఖ్యం కాదని ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాను. కానీ గత ఏడాది కాలంలో ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు. వారి గొంతులను అణచివేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ దాని ఫలితమే" అని ఆరోపించారు.
- 09.45 AM
Himachal Pradesh Politics : హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల తర్వాత రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. రాష్ట్రంలో ఏకైక రాజ్యసభ సీటును గెలుచుకున్న ఒకరోజు తర్వాత జైరాం ఠాకుర్ నేతృత్వంలోని బీజేపీ నేతలు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో గవర్నర్‌ను బుధవారం ఉదయం కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగే అర్హత కోల్పోయింది'
రాష్ట్రంలో అధికారంలో ఉండే నైతిక హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందని బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు జైరాం ఠాకూర్ విమర్శించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని అడగ్గా- ఆ విషయం ఇప్పుడే చెప్పలేనని ఠాకుర్ అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగే అర్హత మాత్రం కోల్పోయిందని తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్!
బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవడానికి బీజేపీ ఎమ్యెల్యేను స్పీకర్ సస్పెండ్ చేసి అవకాశం ఉన్నట్లు చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయని, వారిని సస్పెండ్ చేయాలన్న ఆలోచనలో స్పీకర్ ఉన్నట్లు తెలిపారు. ఇటీవలే అసెంబ్లీలో జరిగిన ఘటనలను గురించి గవర్నర్‌కు వివరించినట్లు చెప్పారు.
"అసెంబ్లీలో ఏం జరిగిందో గవర్నర్‌కు తెలియజేశాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ ప్రవర్తన గురించి మొత్తం వివరించాం. అసెంబ్లీలో ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఓటింగ్ కోరినప్పుడు అనుమతించలేదు. సభ రెండుసార్లు వాయిదా పడింది. ఆ తర్వాత మా ఎమ్మెల్యేలతో మార్షల్స్ ప్రవర్తించిన తీరు సరికాదు. ఆ సమయంలో ఎమ్మెల్యేలు గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఎప్పుడూ ఇలా జరగలేదు"
-- జైరాం ఠాకుర్, ప్రతిపక్ష నేత
హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన మూడు స్థానాల్లో స్వతంత్రులు ఉన్నారు. మరోవైపు బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న వేళ బీజేపీ డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అది జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడి కుప్పకూలే ప్రమాదముంది. ఇదంతా జరగక ముందే సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
హిమాచల్‌లో ఆపరేషన్ కమలం- సుఖు సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం? రంగంలోకి డీకే, హుడా
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్- 10 సీట్లలో బీజేపీ విజయభేరి, 3స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు