Himachal Pradesh Political Crisis : హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. అందుకు అక్కడి నేతల వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి. తమతో మరికొందరు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే రాజీందర్ రాణా తెలిపారు. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు పాలనలో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. 'సుఖు స్నేహితులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మంత్రులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం లభించడం లేదు. క్రాస్ ఓటింగ్‌లో పాల్గొన్న తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాకుండా మరో తొమ్మిది మంది మాతో టచ్‌లో ఉన్నారు. మంత్రి విక్రమాదిత్య సింగ్ దిల్లీకి వెళ్తూ మమ్మల్ని కలిశారు. ప్రభుత్వంతో సర్దుబాటు చేసుకోమని మాకు చెప్పలేదు. ప్రభుత్వంతో ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మాకు తిరిగివచ్చే ఉద్దేశం లేదు' అని రాణా స్పష్టం చేశారు.
క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంపై రాణా స్పందించారు. 'రాష్ట్రానికి చెందిన ఎంతోమంది నేతలు ఉండగా బయటినుంచి వచ్చిన అభిషేక్ మను సింఘ్వీని నిలబెట్టడం వల్ల మేం కలత చెందాం. హిమాచల్ ప్రయోజనాల కోసమే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డాం' అని వెల్లడించారు.
68మంది సభ్యులున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 40, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో ముగ్గురు స్వతంత్రులు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీలకు 34 చొప్పున ఓట్లు వచ్చాయి. ఫలితం టై కావడం వల్ల నిబంధనల ప్రకారం లాటరీ తీశారు. అందులో బీజేపీకి చెందిన హర్ష్ మహాజన్‌ను అదృష్టం వరించడం వల్ల ఆయన గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత సింఘ్వీ ఓటమిపాలయ్యారు.
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలపై సుఖు సర్కార్ అనర్హత వేటు వేసింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సంక్షోభం ముగిసిందని కాంగ్రెస్ పరిశీలకులు ప్రకటించారు. కానీ ఆ వెంటనే ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ప్రతిభాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకంటే ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ మెరుగ్గా పనిచేస్తోందని ఆమె మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఇదిలాఉంటే ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్ ఫేస్‌బుక్ బయో నుంచి తన అధికారిక గుర్తింపు తొలగించారు.
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ దర్యాప్తు ముమ్మరం- అనుమానితుడి గుర్తింపు! 8 బృందాలతో గాలింపు