Heatwave In North India : ఉత్తరాదిలో అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతుండగా, ఈశాన్య రాష్ట్రం అసోంలో వరదలు ముంచెత్తాయి. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీ, రాజస్థాన్, హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీ సెల్సియస్ దాటుతున్నాయి. వడగాలులతో ప్రజలు పిట్టలు రాలినట్టు రాలుతున్నారు. బిహార్‌లో అత్యధికంగా మృత్యువాతపడ్డారు. ఇందులో పోలింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. వడదెబ్బకు గురై పదుల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు.
నాగ్‌పుర్‌లో నిప్పుల వర్షం
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో శుక్రవారం నిప్పుల వర్షం కురిసినట్లైంది. ఎండ వేడి ఏకంగా 56 డిగ్రీలకు చేరినట్లు సమాచారం. అధికార యంత్రాంగం దీనిని ధ్రువీకరించాల్సి ఉంది. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే హడలిపోయారు. ఇళ్లలో ఉన్నా ఎలాంటి ఉపశమనం లభించలేదు. దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి.
బిహార్‌లో 94మంది మృతి
వేడిగాలుల కారణంగా బిహార్‌లో గురువారం నుంచి శుక్రవారం వరకు 24 గంటల వ్యవధిలో 14మంది చనిపోయారు. అందులో 10మంది పోలింగ్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువమంది భోజ్‌పుర్ జిల్లాలో మరణించినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో మృతుల సంఖ్య 94కు చేరింది. మరోవైపు, వేడి గాలుల కారణంగా 300మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిని వివిధ ఆస్పత్రుల్లో చేర్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఇంటికి నుంచి బయటక రావొద్దని హెచ్చరిస్తున్నారు. బిహార్‌లో ఔరంగాబాద్‌లోనూ భానుడు ప్రతాపం చూపించాడు. గురువారం ఇక్కడ 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 19మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
13మంది పోలింగ్ సిబ్బంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో వడదెబ్బతో 13మంది పోలింగ్ సిబ్బంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. 23మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. ఇక సోన్‌భద్ర జిల్లాలో మరో ముగ్గురు పోలింగ్ సిబ్బంది చనిపోయినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అనారోగ్యానికి గురైన మరో 8మందిని ఆస్పత్రులకు తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఒడిశాలో నలుగురు మృతి
ఎండ తీవ్రత కారణంగా ఒడిశాలోని సుందర్గఢ్లో ఉన్న రవుర్కెలా ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం నలుగురు మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. గురువారం 50మంది అస్వస్థతతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని, అందులో నలుగురు మరణించినట్లు రూర్కేలా అడిషనల్ మేజిస్ట్రేట్ అశుతోశ్ కులకర్ణి తెలిపారు.
ఈశాన్యాన్ని ముంచెత్తిన వరదలు
మరోవైపు, ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. రెమాల్ తుపాను తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అసోంలో మొదలైన వరదలు మరింత తీవ్రరూపం దాల్చాయి. శుక్రవారం వరదల కారణంగా ఆ రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందారు. దీంతో మే 28 నుంచి మొదలైన భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 12కు చేరింది. అసోంలోని 11 జిల్లాల పరిధిలో 3.5 లక్షల మంది వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల రోడ్లు, రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి.
వేలాది హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో ఫోన్‌లో మాట్లాడి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, కొండచరియలు విరిగిపడడం వల్ల హఫ్లాంగ్-బాదర్‌పుర్ రైల్వే మార్గాన్ని అధికారులు మూసేశారు. రానున్న రెండు రోజుల్లో దిబ్రూగఢ్ సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తాజాగా ప్రకటించింది.
-
VIDEO | Visuals of flooding from Lairikyengbam Leikai village near Imphal, earlier today. In the Imphal East district of Manipur, Barak River at Chotabekra is at 30.15 metres, 3.95 metres above its danger level.
— Press Trust of India (@PTI_News) May 31, 2024
(Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/dbkLwqIGAW
మణిపుర్‌లో భారీ వరద
కొద్ది రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా మణిపుర్ రాజ్‌భవన్ వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. అయితే, రెండురోజుల క్రితం కంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి మెరుగైందని, మిగతా నీటిని తొలగిస్తామని అధికారులు తెలిపారు. "రాజ్‌భవన్ వరదల్లో మునిగిపోతోంది. రాష్ట్ర గవర్నర్ అక్కడ వ్యక్తిగతంగా నీటి స్థాయిని కొలవడం అరుదైన విషయం" అంటూ ఎంపీసీసీ ప్రతినిధి భూపేంద్ర ఎక్స్ వేదికగా విమర్శించారు. ఇంఫాల్ లోయలో వరదల కారణంగా ముగ్గురు చనిపోయారని, వేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వెల్లడించారు.