Haryana Road Accident Today : హరియాణాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా గురువారం మహేంద్రగఢ్ జిల్లాలోని నర్ణౌల్ పట్టణంలో స్కూల్ బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 నుంచి 40మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు డ్రైవర్ మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడని, అదే బస్సు బోల్తా పడటానికి ప్రధాన కారణమని పోలీసులు చెప్పారు. ఇప్పటికే బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మహేంద్రగఢ్ ఎస్పీ అర్ష్ వర్మ తెలిపారు.
'డ్రైవర్ తాగి బస్సు నడిపాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతడు నిజంగా తాగి వాహనం నడిపాడా లేదా అనే దానిపై ఓ స్పష్టత వస్తుంది. అలాగే డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడినట్లుగా కొందరు చెబుతున్నారు. ఇది కూడా తెలియాల్సి ఉంది' అని ఎస్పీ అర్ష్ వర్మ చెప్పారు. ఇక బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సీమా ట్రిఖ్హా తక్షణమే మహేంద్రగఢ్‌కు బయలుదేరి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
"20మంది గాయపడిన విద్యార్థులను మా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అందులో అప్పటికే నలుగురు చనిపోయారు. 16మందిలో ఒక విద్యార్థిని వెంటనే వెంటిలేటర్‌పై ఉంచాము. అయితే 10 నిమిషాలకే అతడు కూడా మరిణించాడు. మొత్తంగా తీవ్రంగా గాయపడిన విద్యార్థుల్లో మేము 15 మందిని రక్షించగలిగాము. వీరందరికీ ప్రథమ చికిత్స అందించిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశాము."
- డాక్టర్ రవి కౌశిక్, ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు
'డ్రైవర్ తాగి 120 కి.మీ వేగంతో బస్సు నడిపాడు'
'నా పేరు ఆదిత్య. నేను ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాను. మా స్కూల్ బస్సు డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడు. 120 స్పీడ్‌లో వాహనాన్ని నడిపాడు. దీంతో బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 50 మందిదాకా ఉన్నాము' అని ప్రమాదానికి గురైన ఓ విద్యార్థి తెలిపాడు.
పండుగ వేళ విషాదం- బస్సు లోయలో పడి 17మంది భక్తులు దుర్మరణం- 38మందికి గాయాలు - Pakistan Road Accident