Haryana Assembly Election 2024 : హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం సవరించింది. అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా, దానిని అక్టోబర్ 5కు మార్చింది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టాలని తొలుత నిర్ణయించగా అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు.
హరియాణా ప్రజలు తమ మూలపురుషుడు గురు జంబేశ్వర్ స్మారకంగా అసోజ్ అమవాస్య పండగను నిర్వహిస్తారు. ఈ వేడుకలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. బిష్ణోయ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఈ క్రమంలో తమ ఓటు హక్కును కోల్పోకూడదన్న ఉద్దేశంతో తేదీలు మార్చినట్లు ఈసీ పేర్కొంది. ప్రజాస్వామ్యంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్న ఉద్దేశంతో పోలింగ్ తేదీలను మార్చినట్లు ఈసీ ఓ ప్రకటన జారీ చేసింది.
Haryana Assembly polls now on Oct 5 instead of Oct 1 keeping in mind centuries-old festival of Bishnoi community. Counting for Jammu and Kashmir and Haryana Assembly polls now on Oct 8 in place of Oct 4: Election Commission pic.twitter.com/TBJ59BolWW
— Press Trust of India (@PTI_News) August 31, 2024
- నోటిఫికేషన్ విడుదల తేదీ : సెప్టెంబర్ 05
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: సెప్టెంబర్ 12
- నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 13
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: సెప్టెంబర్ 16
- అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: అక్టోబర్ 05
- ఎన్నికల ఫలితాల తేదీ: అక్టోబర్ 08
హరియాణాలో మొత్తం 90 శాసనసభ స్థానాలున్నాయి. వాటిలో 73 జనరల్ స్థానాలు కాగా 17 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు గతంలో సీఈసీ రాజీవ్ కుమార్ ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రెండు కోట్లకుపైగా ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. 4.52 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జననాయక జనతా పార్టీ (జేజేపీ)తో పొత్తు పెట్టుకుని అధికారం చేపట్టింది. ప్రస్తుత ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఇక పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది.
మరోవైపు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టాలని తొలుత నిర్ణయించగా, హరియాణా పోలింగ్ తేదీని మార్చడం వల్ల కౌటింగ్ అక్టోబర్ 8న జరగనుంది.