Former DU Professor Saibaba Passed Away : దిల్లీ వర్శిటీ మాజీ ఆచార్యులు జీఎన్ సాయిబాబా తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో వారం క్రితం నిమ్స్‌లో చేరిన ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యం విషమించి నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో 2014లో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో దాదాపు తొమ్మిదేళ్లపాటు జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో నాగ్‌పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు అనారోగ్యంతో లోకాన్ని విడిచారు.
రచయిత, మానవ హక్కుల కార్యకర్తగా పేరుపొందిన ఆచార్య సాయిబాబా స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం. పోలియో సోకి ఐదేళ్ల వయసులోనే రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జైలులో ఖైదీల స్థితిగతులపైనా గళం విప్పిన ధీశాలిగా సాయిబాబా గుర్తింపు పొందారు.