Five Rivers Meet India: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రకృతికి దూరంగా నిత్యం రణగొణధ్వనుల మధ్య యాంత్రికంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ మాత్రం ఖాళీ దొరికినా ప్రకృతిలో సేద తీరడానికి సిద్ధమవుతారు. ముఖ్యంగా నదులు, పర్వతాలను చూసేందుకు ఇష్టపడతారు. నదుల సంగమం వద్ద ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంత లభిస్తున్నట్లు ఉంటుంది. అక్కడి అద్భుతమైన, సుందరమైన ప్రకృతి అందాలను వర్ణించాలంటే మాటలు చాలవు.
కాగా నదుల సంగమం అంటే ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగలో అలకనంద.. మందాకిని నదులే గుర్తొస్తాయి. ఈ ప్రదేశాలకు వెళ్లిన వారు మానసిక ప్రశాంతతను గడుపుతారు. అయితే ఇలా రెండు మూడు నదులు కాకుండా ఏకంగా ఐదు నదుల సంగమం ఉందని మీకు తెలుసా? మీరు విన్నది నిజమే. ఐదు నదులు కలిసే ప్రదేశం ఉంది. అదీ కూడా మన దేశంలోనే! మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆ ప్రదేశం అక్కడే: ఉత్తరప్రదేశ్‌లోని రుద్రప్రయాగలో.. అలకనంద, మందాకినీ రెండు నదుల సంగమం ఉంది. ఇక ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి(గంగ, యమున, సరస్వతి)సంగమం ఉంది. దీంతో ఈ ప్రదేశాలు అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా వాటి సొంత వైభవాన్ని, గుర్తింపుని తెచ్చుకున్నాయి. అయితే ఇదే ఉత్తరప్రదేశ్‌లో ఐదు నదుల సంగమం ఉన్న ఒకే ఒక ప్రదేశం ఉంది.
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం. ఈ 5 నదుల సంగమం కూడా ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో ఔరయ్యా.. ఇటావా సరిహద్దులో ఉంది. ఇక్కడ యమునా, చంబల్, సింధ్, పహాజ్, కున్వారీ అనే ఐదు నదులు ఒకే దగ్గర కలుస్తాయి. ఐదు నదుల సంగమం కారణంగా ఈ ప్రాంతాన్ని పంచనాద్ అని పిలుస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ ప్రదేశం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని మహా తీర్థరాజ్ అని కూడా పిలుస్తారు.
తీర్థక్షేత్రం ప్రాముఖ్యత : ఈ తీర్థక్షేత్రం గురించి ఎన్నో పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. పురాణాల ప్రకారం.. భగీరథుడు తన పితామహుల పాపాలను కడగడానికి గంగానదిని భూమికి తీసుకురావడానికి తపస్సు చేశాడు. గంగానది భూమిని చేరుకున్నప్పుడు, అది ఐదు ప్రవాహాలుగా విడిపోయిందట. తర్వాత అవి చివరికి పంచనాద్‌లో కలిసిపోయాయని పండితులు చెబుతున్నారు. మరో కథ ఏంటంటే.. మహాభారత కాలంలో పాండవులు వనవాసం చేసిన ప్రదేశం ఇదేనని చెబుతారు.
ఏటా లక్షల సంఖ్యలో భక్తులు: ఏటా ఇక్కడికి కార్తీక మాసంలో పవిత్రస్నానం చేయడానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ స్నానం చేస్తే.. పాపాలు అన్నీ తొలగిపోయి పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పంచనాద్ చుట్టూ అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వారు స్థానికంగా ఉన్న భగీరథ దేవాలయం, శివాలయాన్ని తప్పకుండా సందర్శిస్తారు.