First Session Of 18th Lok Sabha : 18వ లోక్‌సభ తొలి సెషన్ సోమవారం ఆరంభం కానుంది. ఈ నెల 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ వ్యవహరించనున్నారు. భర్తృహరి మహతాబ్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందే బిజు జనతాదళ్‌ను వీడి బీజేపీలో చేరారు. కటక్ నుంచి పోటీచేసి ఏడోసారి విజయదుందుభి మోగించారు.
మోదీతో ప్రమాణం చేయించాక!
సోమవారం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. అనంతరం పార్లమెంట్‌కు చేరుకోనున్న భర్తృహరి 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో భర్తృహరి ప్రమాణం చేయిస్తారు. తర్వాత తనకు సహయకులుగా రాష్ట్రపతి నియమించిన ప్యానల్ ఆఫ్ ఛైర్‌పర్సన్‌లతో భర్తృహరి ప్రమాణం చేయిస్తారు.
తెలుగు ఎంపీలు ఎప్పుడంటే?
కేబినెట్ మంత్రుల ప్రమాణం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మొదలవుతుంది. తొలుత కేబినెట్, తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులుగా ఉన్న లోక్‌సభ సభ్యులు ప్రమాణం పూర్తి చేస్తారు. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు. సాధారణ సభ్యుల్లో అండమాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యుడు బిష్ణుపద రే తొలుత ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో పూర్తవుతుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్‌తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి. చిట్టచివరన బంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బీర్‌భూమ్ శతాబ్దిరాయ్‌తో ఈ క్రతువు ముగుస్తుంది.
స్పీకర్ ఎన్నిక ఆరోజే
అయితే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఈ నెల 26వ తేదీన జరగనుంది. అనంతరం ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను సభకు పరిచయం చేస్తారు. జూన్ 27న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. 28వ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. జులై 2 లేదా 3వ తేదీన ఈ చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని రోజుల విరామం అనంతరం జులై 22న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను జులై 22న ప్రవేశపెట్టనున్నారు.
కొత్తగా గెలిచిన ఎంపీలు వెంటనే ఆ పని చేయాలట! - lok sabha election results 2024