Vande Bharat Train Sleeper Coach Video : భారతీయ రైల్వేల ప్రస్థానంలో వందేభారత్ విప్లవాత్మకమైన మార్పు. ఇప్పుడిది వందేభారత్ స్లీపర్‌గా కూడా సేవలందించేందుకు సిద్ధమైంది. రైలు ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందేభారత్ స్లీపర్ బోగీలు ప్రస్తుతం తమిళనాడు చెన్నై ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ)లో తయారవుతున్నాయి. ప్రయోగాత్మకంగా సిద్ధం చేసిన బోగీని ఐసీఎఫ్ అధికారులు బుధవారం విలేకర్లకు చూపించారు. ఇంటెగ్రల్ కోచ్‌ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సుబ్బారావు రైళ్లకు సంబంధించి పలు విషయాలను షర్ చేసుకున్నారు.
గంటకు గరిష్ఠంగా 160 కి.మీ. వేగంతో!
బోగీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏకధాటిగా 1,200 కి.మీ. ప్రయాణించేందుకు అవసరమైన సదుపాయాలు ఉంటాయని సుబ్బారావు తెలిపారు. గంటకు గరిష్ఠంగా 160 కి.మీ. వేగంతో పయనించేలా రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇందులో మొబైల్ ఛార్జింగ్, మేగజైన్లు, టేబుల్, చిన్నపాటి లైట్, సామగ్రి కోసం విశాల స్థలం, వేడి నీరు, సీసీ కెమెరాలు, అత్యవసర సమయాల్లో డ్రైవరుతో మాట్లాడే సౌకర్యం, బయో వాక్యూమ్ మరుగుదొడ్లు ఉన్నాయని వివరించారు.
జీఎఫ్‌ఆర్‌పీ ప్యానెల్స్, సుఖవంతమైన కుషన్ ఫోమ్‌తో బెర్త్‌లు వంటివి ఏర్పాటు చేసి ప్రయాణాన్ని సుఖవంతంగా, ఆహ్లాదకరంగా చేయనున్నట్టు చెప్పారు. ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్‌మెంట్‌లో 24 మంది ప్రయాణించవచ్చని సుబ్బారావు వెల్లడించారు. సెకండ్ క్లాస్ ఏసీ కోచ్‌లో 188 మంది ప్రయాణించవచ్చని తెలిపారు. థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లలో 611 మంది ప్రయాణికులు వెళ్లవచ్చని పేర్కొన్నారు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సరుకులు తీసుకెళ్లేలా!
త్వరలోనే సరకు రవాణా రైళ్లనూ రూపొందిస్తామని తెలిపారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థలకు సరకులు తీసుకెళ్లేలా ఈ ప్రాజెక్టు చేపట్టబోతున్నామని వెల్లడించారు. అలాగే 250 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు వీలుగా హైస్పీడ్ రైలు ప్రాజెక్టునూ చేపడతామని ప్రకటించారు. వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చే ఏడాది జనవరి 15వ తేదీకి ఆమోదం పొందే అవకాశం ఉందని చెప్పారు.
ఐసీఎఫ్‌లో 2018 నుంచి తయారవుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు దేశవ్యాప్తంగా 77 వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. అయితే ఇప్పటివరకు తయారు చేసిన వందేభారత్ కోచ్‌లు కేవలం కూర్చునేందుకు వీలుగా చైర్‌కార్ సౌకర్యంతోనే నిర్మించారు.రాత్రి వేళల్లో కూడా దూరప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు వీలుగా పూర్తి ఏసీ కోచ్‌లతో వందేభారత్ స్లీపర్ కోచ్‌లను ఐసీఎఫ్ తయారు చేస్తోంది.