Petrol Bike Convert To Electric Bike : పర్యావరణ పరిరక్షణ కోసం, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందకు పాత పెట్రోల్ బైక్‌ను ఎలక్ట్రిక్ బండిగా మార్చాడు ఓ మెకానిక్. పాత, కొత్త భాగాలను ఉపయోగించి కేవలం రూ.35 వేలతో తయారు చేశాడు. కేవలం రూ.9 ఖర్చుతో 50కిలోమీటర్లు నడిచే విధంగా రూపొందించాడు. అతడే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మెకానిక్ శ్రీకాంత్.
ఫరూఖాబాద్ జిల్లాకు చెందిన శ్రీకాంత్- పిండి మిల్లు నడుపుకుంటూ, బైక్‌లను రిపేరు చేస్తుంటాడు. ఓ రోజు రోడ్డుపై వెళ్తుంటే ఒక పాత బైక్ నుంచి విపరీతంగా పొగలు రావడం చూసి, తన బైక్ కూడా కాలుష్యాన్నికి కారణమవుతుందని గ్రహించినట్లు శ్రీకాంత్ చెప్పాడు. అప్పుడే పర్యావరణానికి హాని కలుగుకుండా ఉండేలా తన బైక్‌ను మార్చాలని ఆలోచన వచ్చినట్లు వివరించాడు. అందుకోసం తన దగ్గర 16 ఏళ్లుగా ఉన్న బండిని ఈవీ బైక్‌గా మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
![Petrol Bike Convert To Electric Bike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-10-2024/22727555_bike.jpg)
15 రోజుల్లో తయారీ
పెట్రోల్ బండిని ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చేందుకు వేరే మెకానిక్‌ల దగ్గర నుంచి కావాల్సిన సలహా తీసుకోవడమే కాకుండా ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకున్నాడు శ్రీకాంత్. ఆ తర్వాత వాటి కోసం పాత వస్తువులను కొన్నింటిని సేకరించాడు. మిగిలిన కొన్ని భాగాలను కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. 10-15 రోజుల పాటు కష్టపడి పెట్రోల్ బండిని పూర్తిగా ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. బండికి చైన్ కూడా లేదని, పెట్రోల్ ఇంజిన్‌ను తీసివేసి దాని స్థానంలో 60 వోల్ట్ బ్యాటరీని అమర్చినట్లు శ్రీకాంత్ తెపాడు.
'' దీనిని తయారు చేసేందుకు నాకు రూ.30 నుంచి రూ.35 వేలు ఖర్చు అయ్యింది. ఒక్కసారి ఛార్జింగ్ చేసేందుకు ఒకటిన్నర యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. అంటే సుమారు రూ.9. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే గంటకు 50 కిమీ వేగంతో 50 కిమీ దూరం ప్రయాణించవచ్చు. సాధారణంగా ఒక లీటర్ పెట్రోల్‌తో 50 నుంచి 60 కిమీ ప్రయాణిస్తాయి. లీటర్ పెట్రోల్ ధర దాదాపు రూ.108 ఉంది. దీంతో పోలిస్తే ఖర్చు చాలా తక్కువగా అవుతుంది. అయితే బ్యాటరీని వెనుక భాగంలో అమర్చితే పెట్రోల్, ఎలక్ట్రిక్ బైక్‌గా ఉపయోగించుకోవచ్చు."
- శ్రీకాంత్, మెకానిక్
![Petrol Bike Convert To Electric Bike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-10-2024/22727555_vehicle.jpg)
ఈ బైక్ ఓవర్‌లోడ్ అయినప్పటికీ బాగానే రన్ అవుతుందని శ్రీకాంత్ అంటున్నాడు. లగేజీతో పాటు ఇద్దరు వ్యక్తులు హాయిగా కూర్చోవచ్చని, దీని నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని తెలిపాడు. కొత్త పెట్రోల్, ఎలక్ట్రిక్ బైక్‌లు ధర ఎక్కువగా ఉంటుందని, వాటిని కొనలేని వారు పాతవి, పనికిరాని వాహనాలను ఈ విధంగా సులభంగా మార్చుకోవచ్చని అంటున్నాడు. దీని వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని, పెద్దగా శబ్దం కూడా చేయదని పేర్కొన్నాడు.