Farmers Reject Govt Proposal : వచ్చే ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసేలా కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఎంఎస్పీపై కేంద్రం ప్రతిపాదన రైతుల ప్రయోజనాల కోసం కాదని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ ధల్లేవాల్ ఆరోపించారు. అందుకే ఎంఎస్పీపై కేంద్రం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని తెలిపారు.
-
VIDEO | Here's what SKM (Non-Political) leader Jagjit Singh Dallewal said on farmer unions' decision to reject Centre's proposal of procuring pulses, maize, cotton at MSP for 5 years.
— Press Trust of India (@PTI_News) February 19, 2024
"The reason for not accepting government's proposal (on MSP guarantee) is that they said… pic.twitter.com/EIdplo8Zmm
"సమావేశంలో కేంద్ర మంత్రులు మాతో చర్చించిన విషయాలకు మీడియాకు చెప్పిన వివరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మాతో అన్ని పంటలను కొనుగోలు చేస్తామని చెప్పారు. పప్పు దినుసులపై ఎమ్‌ఎస్‌పీ కోసం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రులు మాతో తెలిపారు. కానీ, రూ.1.75 లక్షల కోట్లు వరకు ఖర్చు చేయొచ్చని నిపుణులు అంటున్నారు. అందువల్ల కేంద్రం ప్రతిపాదనను మేం తిరస్కరిస్తున్నాం. ఫిబ్రవరి 21 దిల్లీలో శాంతియుత ర్యాలీ చేపట్టేందుకు రైతులను అనుమతించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం" అని జగ్జీత్ చెప్పారు. మరోవైపు, ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 11 గంటలకు రైతులు శాంతియుతంగా దిల్లీ వైపు వెళ్తారని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ వెల్లడించారు.
ఇంటర్నెట్ బంద్
రైతుల దిల్లీ చలో ఆందోళనల నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్(రీఛార్జ్, బ్యాంకింగ్ సేవలు మినహా) సేవలపై విధించిన నిషేధాన్ని ఫిబ్రవరి 20 వరకు పొడిగించింది. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిస్సార్, ఫతేహాబాద్, శిర్సా జిల్లాలో ఈ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలపై నిషేధం ఉండనుంది.
ఆదివారం రాత్రి సుదీర్ఘ సమయం రైతు సంఘాలతో చర్చలు జరిపిన కేంద్ర మంత్రులు వారి ముందు కీలక ప్రతిపాదనలు చేశారు. ఇందులో భాగంగా రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని మంత్రుల బృందం ప్రతిపాదించింది. ప్రభుత్వ ప్రతిపాదనలపై అన్ని రైతు సంఘాలతో చర్చించి, నిపుణుల అభిప్రాయాలు తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పారు. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి.