Farmers Drains Borewell Water To River : దేశంలో అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావ పరిస్థితులతో నదులు, వాగులు, వంకలు, చెరువులు ఎండిపోతున్నాయి. తాగునీటికి చాలా చోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జంతువుల బాధ అయితే వర్ణనానీతతం. తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు రైతులు తమ మంచి మనసు చాటుకుంటున్నారు. జంతువుల కోసం తమ బోరుబావుల నుంచి నీటిని నదిలోకి వదులుతున్నారు.
శివమొగ్గ జిల్లా హోసానగర్ తాలూకా సూదురు గేట్‌కు చెందిన మంజునాథ్ భట్ అలియాస్ పాపన్న భట్ పొలం కుమద్వతి నది పక్కనే ఉంది. అతడు వర్షాకాలంలో నదిలోని నీటిని తోడి పొలాలకు వదులుతాడు. అయితే నదిలోని నీరు తాగేందుకు దున్నలు, జింకలు, కుందేళ్లు, నెమళ్లు, ఇతర అడవి జంతువులు వస్తుంటాయి. ఆ సమయంలో నదిలో నీరు లేకపోతే బిగ్గరగా అరుస్తాయి. ఆ అరుపులు విన్న పాపన్న భట్ట ఇప్పుడు నదిలోకి తన బోరుబావి నుంచి నీటిని పైపుల ద్వారా వదులుతున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్‌తో!
"ప్రస్తుతం నదిలో నీరు లేక అడవి జంతువులు ఇబ్బందులు పడుతున్నాయి. నీరు లేకుంటే వాటి అరుపులు వినడం కష్టం. అందుకే నీటిని వదులుతున్నాను. రోజూ ఆరు గంటలపాటు ఉచిత విద్యుత్ వస్తుంది. నదిలోకి రెండు గంటలపాటు నీళ్లు వదులుతున్నాను. మిగిలిన నాలుగు గంటలు పొలానికి నీళ్లు పెడుతున్నా. వానాకాలంలో వరి నాట్లు వేసేటప్పుడు నది నుంచి నీళ్లు తీసుకెళ్తాను. ఇప్పుడు కరువు సమయంలో నది ఎండిపోయినప్పుడు నీళ్లు వదులుతున్నా. మోటర్ ఏర్పాట్లు నేనే చేసుకుంటాను. ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా కరెంటు ఇస్తోంది. దీనివల్ల నీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు" అని మంజునాథ్ పాపన్న భట్ చెప్పారు.
మరో రైతు కూడా!
హావేరి జిలాల్లోని సంగూరు గ్రామానికి చెందిన మరో రైతు భువనేశ్వర్ శిడ్లాపురా కూడా వరదా నదిలోకి నీళ్లు వదులుతున్నారు. "ఇంత కాలం వరదా నది నీళ్లను నేను వాడుకున్నా. కానీ ఇప్పుడు నది ఎండిపోయింది. అడవి జంతువులకు, పశువులకు నీళ్లు లేవు. మనుషులకు, పశువులకు నీళ్లివ్వడం నా కర్తవ్యం" అని భువనేశ్వర్ శిడ్లాపురా తెలిపారు. గత పదిరోజులుగా నీళ్లను వదిలే పనిలో నిమగ్నమై ఉన్నట్లు చెప్పారు.
'ప్రకృతి మాత రుణం తీర్చుకుంటున్నా'
"ప్రకృతి మాత రుణం తీర్చుకుంటున్నా. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా కరవు వచ్చింది. నదిలోకి రోజుకు 6 గంటలపాటు నీటిని వదులుతున్నా. పగటిపూట మూడు గంటలు, రాత్రి మూడు గంటలు. ప్రభుత్వం మరింతగా ఉచిత విద్యుత్ ఇస్తే నదిలోకి నీరు వదులుతాను" అని రైతు భువనేశ్వర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఇద్దరు రైతులపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.