Erode MP Ganeshamurthi Death : టికెట్ రాలేదని మనస్తాపంతో పురుగులమందు ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన తమిళనాడుకు చెందిన డీఎండీకే ఎంపీ (ఈరోడ్) గణేశమూర్తి (77) కన్నుమూశారు. కొయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 5 గంటల సమయంలో మరణించారు.
గణేశమూర్తి పార్థివదేహాన్ని పోలీసులకు అందించింది ఆస్పత్రి యాజమాన్యం. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నిఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టు (ఐఆర్టీ) మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష తర్వాత మృతదేహాన్ని కుమారవలసు గ్రామానికి తీసుకెళ్లి ఖననం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం దక్కింది. ఈ స్థానం నుంచి గణేశమూర్తి ఉదయించే సూర్యుడి (డీఎంకే) గుర్తుపైనే పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో కూటమి సర్దుబాట్లలో భాగంగా ఎండీఎంకేకు తిరుచ్చి కేటాయించారు. అక్కడి నుంచి దురైవైగోను పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గణేశమూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం (మార్చి 24) తన నివాసంలో పురుగుల మందు ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యయత్నం చేశారు. వెంటనే ఆయన్ను కొయంబత్తూర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం హార్ట్ ఎటాక్ రావడం వల్ల గణేశమూర్తి మరణించారని ఆస్పత్రి ప్రకటించింది.
1947 జూన్‌లో గణేశమూర్తి జన్మించారు. 1993లో ఎండీఎంకే ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పార్టీలో ఉన్నారు. 1998లో తొలిసారిగా పళని లోక్‌సభ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ సభ్యుడిగానూ వ్యవహరించారు. మళ్లీ 2009లో ఈరోడ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లో ఓటమి పాలై, గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి దాదాపు 2లక్షల భారీ మెజారిటీతో మరోసారి గెలుపొందారు. 2016లో పార్టీ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. గణేశమూర్తి భార్య చనిపోయింది. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఓటరు ఐడీ లేకుండానే ఓటు వేయొచ్చు- ఎలాగో తెలుసా? - How To Vote Without Voter ID Card