Eknath Shinde Interview With ETV Bharat : గత రెండేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ, తమ ప్రభుత్వం చేసిన కృషి కారణంగా రాష్ట్రంలో 'మహాయుతి' 40కి పైగా స్థానాలను గెలుచుకుంటుదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ధీమా వ్యక్తం చేశారు. ఇంట్లో కూర్చొని ఫేస్బుక్లో లైవ్ చేసేవారికి (ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి) ప్రజలు ఓటు వేయరని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే వారికి ప్రజలు మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"గత పదేళ్లలో రైతులు, మహిళలు, యువత, పరిశ్రమల అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు అరవైయేళ్ల కాంగ్రెస్ పాలనలో తీసుకోలేదు. అభివృద్ధి అజెండాతో మేము ప్రజల ముందుకు వెళ్లాం. ప్రజలు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి మహాయుతికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో 40 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని విశ్వసిస్తున్నాను. రాష్ట్రంలో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు మహారాష్ట్ర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో నాలుగో స్థానంలో ఉండేది. జీడీపీ కూడా తక్కువగా ఉండేది. మహాయుతి సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. జీడీపీ కూడా బాగా పెరిగింది. రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అలాగే పరిశ్రమలు వచ్చాయి. రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో దుండగులు పారిశ్రామికవేత్తల ఇళ్ల వద్ద బాంబులు పెట్టి పారిపోయేవారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆపేశారు. రెడ్ కార్పెట్, సబ్సిడీ, సింగిల్ విండో క్లియరెన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు మహారాష్ట్ర వైపు చూస్తున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడం వల్ల ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉపాధి కల్పన కూడా పెరుగుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోంది." అని శిందే వ్యాఖ్యానించారు.
'అభివృద్ధి అజెండాతో ప్రజల్లోకి వెళ్లాం'
తాను, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్ ఒక టీమ్‌గా ఏర్పడి అభివృద్ధి అజెండాతోనే ఓటర్ల వద్దకు వెళ్లామని శిందే తెలిపారు. రెండేళ్లలో రాష్ట్రంలో మహాయుతి సర్కార్ పలు నిర్ణయాలను తీసుకుందని అన్నారు. మహిళల కోసం 'లేక్ లడకీ' పథకం, ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు టికెట్‌పై 50 శాతం రాయితీ, యువత కోసం స్టార్టప్‌లు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు తాము చేసిన అభివృద్ధికి ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 'రాష్ట్రానికి ప్రధాని రాకూడదని రూల్, చట్టం ఏమైనా ఉందా? ప్రధాని ప్రచారానికి రాగానే విపక్షాలు భయపడుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. మెట్రో 2, మెట్రో 7, సమృద్ధి హైవే, అటల్ సేతు ప్రారంభోత్సవాలకు మోదీని పిలిచాం. ఆయన అభివృద్ధిని ఇష్టపడి మేము పిలిచినప్పుడల్లా ఇష్టపూర్వకంగా మహారాష్ట్రకు వచ్చారు. మోదీ రోడ్ షోలకు లక్షలాది ప్రజలు తరలివస్తున్నారు. విపక్షాలు చిన్న వీధుల్లో, రోడ్ కార్నర్‌ల్లో ర్యాలీలు నిర్వహిస్తూ మరింత బలహీనపడ్డాయి.' అని శిందే తెలిపారు.
మహాయుతి VS మహా వికాస్ అఘాడీ
మొత్తం 48 లోక్ సభ స్థానాలున్న మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమిగా విపక్ష పార్టీలు బరిలోకి దిగాయి. ఈ కూటమిలో శివసేన(యూబీటీ), కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ ఉన్నాయి. మరోవైపు మహాయుతి పేరిట ఎన్డీఏ కూటమి బరిలో దిగింది. ఈ కూటమిలో బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన( ఏక్ నాథ్ శిందే వర్గం) పోటీ చేసింది.
యడియూరప్పపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ మృతి- కారణం ఇదే! - BS Yediyurappa POCSO Case