PM MODI Slams Congress JMM : కాంగ్రెస్-జేఎమ్ఎమ్ కూటమి ఓబీసీలను ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఝార్ఖండ్‌లోని బొకారోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
'SC, ST, OBSలకు కాంగ్రెస్-జేఎమ్ఎమ్ వ్యతిరేకం'
"కాంగ్రెస్-జేఎమ్ఎమ్ కుట్రల పట్ల జాగ్రత్త వహించండి. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వారు ఎంతకైనా దిగజారవచ్చు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యతకు కాంగ్రెస్ వ్యతిరేకం. ఐక్యత లేని వరకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూనే ఉంది. దేశాన్ని దోచుకుంది. చోటానాగ్‌పుర్ ప్రాంతంలో 125పైగా ఉపకులాలను ఓబీసీలుగా పరిగణిస్తున్నారు. వారిని ఒకరిపైకి మరోకరిని(ఉపకులాలను) ఉసిగొల్పి కాంగ్రెస్-జేఎమ్ఎమ్ వారి ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి. అందకే ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని హెచ్చరిస్తున్నాను" అని మోదీ అన్నారు.
#WATCH | Jharkhand: While addressing an election rally at Bokaro, Prime Minister Narendra Modi says, " we have one more goal in jharkhand, the paper leak mafia and recruitment mafia created by jmm-congress, they will be attacked. each one of them will be found and put in jail.… pic.twitter.com/9pnRvM5sCI
— ANI (@ANI) November 10, 2024
అంబేడ్కర్‌కు నేను ఇచ్చే నివాళి అదే: ప్రధాని మోదీ
ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుతున్న కాంగ్రెస్ దాని మిత్రపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. "కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు జమ్ముకశ్మీర్ అధికరణ 370ని తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాయి. దాని ద్వారా మన సైనికులు మళ్లీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
(అందుకే) ఆర్టికల్ 370ని మోదీ పాతరేశారు. ఏడు దశాబ్దాలుగా అక్కడ అంబేడ్కర్ రాజ్యాంగం అమలులో లేదు. మొదటిసారి భారత రాజ్యాంగంపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఇది నేను అంబేడ్కర్ ఇచ్చే నివాళి. చొరబాటుదారులను తరిమికొట్టేందుకు, అవినీతి నిర్మూలనకు ఝార్ఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోన ప్రభుత్వం అవసరం. మీరు(ఝార్ఖండ్ ప్రజలనుద్దేశించి) పిడికెడు ఇసుక కోసం ఆరాటపడుతున్నారు. కానీ వారు దాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. (మేము గెలిస్తే) జేఎమ్ఎమ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సృష్టించిన రిక్రూట్‌మెంట్ మాఫియా, పేపర్ లీక్ మాఫియాలను జైలుకు పంపుతాం. యువత భవిష్యత్తుతో ఆడుకున్న వారిని వదిలిపెట్టం" అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
81 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఝార్ఖండ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 23న ఓట్ల కౌంటింగ్ జరగనుంది.