EC On Complaints Against PM Modi : రాజస్థాన్‌లోని బన్స్వారాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై విపక్షాల నిరసనలు వెల్లువెత్తుతుండటం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అప్రమత్తమైంది. ప్రధాని ప్రసంగంలోని వివాదాస్పద అంశాలపై అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్, సీపీఎం పార్టీలు చేసిన ఫిర్యాదులను పరిశీలించే ప్రక్రియను ఈసీ ప్రారంభించింది.
ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. దేశంలోని ఓ మైనారిటీ వర్గానికే దేశపు ఆస్తులపై తొలి హక్కు ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా ఏళ్ల క్రితం చేసిన ప్రకటనను ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ముస్లిం సమాజానికి వనరులను కేటాయించేందుకు ప్రాధాన్యమిస్తాయని మోదీ ఆరోపించారు.
ఇది ఈసీకి అగ్నిపరీక్ష : కాంగ్రెస్
బన్స్వారాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఓ మైనారిటీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది.''ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల మధ్య విభజనను సృష్టించేలా ఉన్నాయి. అవి ద్వేషపూరిత వ్యాఖ్యలు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఓ మత సమూహాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదు'' అని ఈసీకి కాంగ్రెస్ నేతల బృందం తెలిపింది.
ఈసీకి ఫిర్యాదు చేసిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ మీడియాతో మాట్లాడారు. ''ఇది ఎన్నికల కమిషన్‌కు అగ్నిపరీక్ష లాంటిది. ఈసీ ప్రతిష్ఠకు సంబంధించిన విషయమిది. ఈ వ్యవహారంలో అందరిలాగే ప్రధాని మోదీకి కూడా ఎన్నికల కోడ్‌ను వర్తింపజేయాలి. లేదంటే ఈసీ ప్రతిష్ఠకు కళంకం వస్తుంది. ఎన్నికల కోడ్ ప్రకారం నడుచుకోవడం ఈసీ రాజ్యాంగపరమైన బాధ్యత'' అని పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే : సీపీఎం
ప్రధాని మోదీ వివాదాస్పద ప్రసంగంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మోదీ వ్యాఖ్యలపై వెంటనే చర్యలు చేపట్టాలని ఈసీని డిమాండ్ చేశారు. ఓ వర్గం మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు, విద్వేషాలను రెచ్చగొట్టినందుకు ప్రధానిపై తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీని కోరారు.
రెండో విడత పోలింగ్‌కు జోరుగా ఏర్పాట్లు- రాహుల్, హేమమాలిని భవితవ్యమేంటో? - Lok Sabha Elections 2024
'కులగణనకు భయపడుతున్న 'దేశభక్తులు'- అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు' - rahul gandhi on pm modi