Ghazipur Landfill Fire : దిల్లీలోని గాజీపుర్‌లోని డంపింగ్ యార్డులో ఆదివారం సాయంత్రం సంభవించిన భారీ అగ్నిప్రమాదం స్థానికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు దాదాపు 10 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కాగా, పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీగా నల్లని పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. అయితే దట్టమైన పొగలు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని స్థానికులు తెలిపారు.
ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు
ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో గాజీపుర్ డయాపింగ్ యార్డులో అగ్నిప్రమాదం జరిగినట్లు తమకు కాల్ వచ్చిందని దిల్లీ అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 'ముందుగా ఘటనాస్థలికి రెండు అగ్నిమాపక యంత్రాలను పంపాము. కానీ భారీ మంటలు కారణంగా తర్వాత మరో ఎనిమిది ఫైర్ ఇంజిన్లు పంపాము. ప్రస్తుతం మా సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా పేరుకుపోయిన వ్యర్థాల నుంచి ఉత్పత్తి అయ్యే వాయువుల కారణంగా ఈ మంటలు మరింత వ్యాపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు' అని దిల్లీ ఫైర్ సర్వీస్ ఎస్ఓ నరేశ్ కుమార్ తెలిపారు.
మరోవైపు ఈ దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు.' శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. పొగ కారణంగా దగ్గు వస్తుంది. నిద్ర లేచే సరికి ప్రాంతమంతా పొగతో ఉంది. ఈ డపింగ్ యార్డు చుట్టు పక్కల ప్రాంతాలకు అతి పెద్ద సమస్య దుర్వాసన. గత 10 సంవత్సరాల నుంచి ఈ విషయంపై ఫిర్యాదు చేస్తున్న ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు' అని స్థానికులు అంటున్నారు.
ఈ ఘటనపై దిల్లీ మంత్రి, ఆప్ నాయకురాలు ఆతిశీ స్పందించారు. 'ఫైర్ ఇంజన్లు రాత్రంతా ఘటనా స్థలంలో ఉన్నాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. కొద్దిసేపటికి పొగ కూడా పోతుందని మేము ఆశిస్తున్నాం. సోమవారం సాయంత్రమే దిల్లీ డిప్యూటీ మేయర్ ఘటనాస్థలికి వెళ్లనున్నారు' అని ఆతిశీ పేర్కొన్నారు.
సగానికిపైగా యంత్రాలు పనిచేయడం లేదు
డపింగ్ యార్డులోని చెత్తను ప్రభుత్వం సకాలంలో తొలగించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 'ఈ చెత్తను కేజ్రీవాల్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 31లోపు తొలగిస్తామని హామీ ఇచ్చింది. కానీ మాటను నిలబెట్టుకోలేదు. అసలు వ్యర్థాలను తొలగించేందుకు సగానికిపైగా యంత్రాలు కూడా పని చేయలేదు' అని దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరెంద్ర సచ్‌దేవా అన్నారు. ఈ పొగ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేత సర్దార్ రాజా ఇక్బాల్ సింగి స్పందించారు. ' మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ చెత్తను తొలగించేందుకు 25 యంత్రాలు పనిచేశాయి. కానీ, ఇప్పుడు సగానికి పైగా పని చేయడం లేదు. దీంతో చెత్త మరింత పెరిగిపోయింది. వీటిని తొలగించేందుకు వేరే పనులు కూడా ఏమి చేయలేదు. అవినీతి ద్వారా డబ్బును సంపాదించడానికే కాంట్రాక్టర్లతో ఆప్ నాయకులు కలిసి చేసిన పనిలా కనిపిస్తోంది' అని ఇక్బాల్ సింగ్ విమర్శించారు.
2026 నాటికి తొలగించాలని గడువు
ఈ డపింగ్ యార్డు మొత్తం 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. గత కొన్ని సంవత్సరాలు ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగుతున్నాయి. 2017లో డంపింగ్ యార్డులో ఉన్న చెత్తలో కొంత భాగం పక్కనే ఉన్న రోడ్డుపై పడటం వల్ల ఇద్దరు మృతి చెందారు. 2022లో మూడు అగ్నిప్రమాదాలు జరిగిన్నట్లు నమోదయ్యాయి. దిల్లీ ప్రభుత్వం ఈ చెత్తను తొలగించేందుకు ఓ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ముందుగా 2024కి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంక చెత్త ఎక్కువగా ఉండటం వల్ల 2026కి గడువును విధించింది.
ద్విచక్ర వాహనాల గోడౌన్లో అగ్నిప్రమాదం - 70 బైక్‌లు దగ్ధం
Fire Accident in Nashik : మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ ద్విచక్ర వాహనాల గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 70కిపైగా బైక్‌లు కాలిపోయాయి. భారీగా మంటలు చెలరేగడం వల్ల పక్కనే ఉన్న నాలుగు ఇళ్లకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న సిబ్బంది 9 అగ్నిమాపక యంత్రాలలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టొచ్చు? అసలేంటీ వ్యయ పరిమితి? - Lok Sabha elections 2024