Kolkata Medical College Principal Resigns : బంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం చేసి, హతమార్చిన ఘటన పెను సంచలనం రేపింది. ఈ అమానవీయ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు. ఈ పరిణామాల వేళ ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.
జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత మృతురాలి పరువుకు భంగం కలిగించేలా ప్రిన్సిపల్ మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన రాజీనామా చేయాలంటూ కాలేజీ వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో పదవి నుంచి వైదొలిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. "నన్ను పదవి నుంచి దింపేలా విద్యార్థులను కొంత మంది రెచ్చగొట్టారు. నిందితుడికి శిక్ష పడాలనే నేను కోరుకున్నాను. బాధితురాలికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కావాలనే నా పరువు తీస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో నాపై జరుగుతున్న విష ప్రచారాన్ని, అవమానాల్ని భరించలేకపోతున్నాను. మృతి చెందిన అమ్మాయి నా కుమార్తెలాంటిదే. నేను కూడా ఓ తండ్రినే. అందుకే రాజీనామా చేస్తున్నా. భవిష్యత్తులో ఎవరికీ ఇలాంటి దారుణ ఘటన జరగకూడదు" అని డాక్టర్ సందీప్ ఘోష్ అన్నారు.
దారుణం జరిగింది
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ జూనియర్ వైద్యురాలు ఆర్‌జీ కార్ ప్రభుత్వాస్పత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఆమె మర్మాంగాలు, నోరు, కళ్ల నుంచి రక్తస్రావం జరిగినట్లు శవపరీక్షలో తేలింది. శరీరంపై వివిధ చోట్ల గాయాలు కనిపించాయి. దీంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. నిందితుడిని అరెస్టు చేశారు.
ఈ ఘటనతో కాలేజీలోని వైద్య విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసి నిరసనకు దిగారు. గత మూడు రోజులుగా కేవలం ఎమర్జెన్సీ విధులకు మాత్రమే హాజరవుతూ ఆందోళన చేపట్టారు. సోమవారం నుంచి అత్యవసర విధులు కూడా బహిష్కరించారు. దేశవ్యాప్తంగా కొన్నిరకాల వైద్య సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ఫోర్డా (ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్) తెలిపింది.