Delhi New CM Atishi : దిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీని ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపిక చేసింది.. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆతిశీ పేరును ముఖ్యమంత్రిగా ఖరారు చేశారు. ఆతిశీ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. షీలా దీక్షిత్ తర్వాత దిల్లీలో మహిళా సీఎంగా ఆతిశీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ విధులు నిర్వర్తించనున్నారు.
తీవ్ర ఆగ్రహంలో ప్రజలు : ఆతిశీ
దిల్లీ కొత్త సీఎంగా ఎంపికైన ఆతిశీ సింగ్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. తన లాంటి ఫస్ట్‌టైమ్ పొలిటిషియన్‌కు ఇలాంటి బాధ్యతలు అప్పగించడం ఆమ్ ఆద్మీ పార్టీలోనే సాధ్యం అని అన్నారు. కేజ్రీవాల్ రాజీనామాపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.
"ముఖ్యమంత్రిగా నాతో పాటు దిల్లీ ప్రజలు, ఆప్ ఎమ్మెల్యేలు ఒకే లక్ష్యంతో ఎన్నికల వరకు పనిచేస్తాం. మేము దిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్‌ను మళ్లీ గెలిపించాలి. కేజ్రీవాల్ నన్ను నమ్మారు. ఎమ్మెల్యే, మంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిని చేశారు. నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఫస్ట్‌టైమ్ పొలిటిషియన్స్ కేవలం ఆప్‌లో మాత్రమే ఇలాంటి అవకాశాలను పొందగలరు. నేను వేరే పార్టీలో ఉంటే ఇలా జరిగేది కాదు. నేను సంతోషంగా ఉన్నాను. మరోవైపు మా అన్నయ్య(కేజ్రీవాల్) రాజీనామా చేస్తుండటం వల్ల బాధగా ఉంది. ఇది, కేజ్రీవాల్ రాజీనామా చేసే బాధాకరమైన క్షణం కాబట్టి నాకు పూలమాలలు, అభినందనలు తెలపవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈ బాధ్యత తీసుకున్నంత కాలం నా లక్ష్యం ఒక్కటే. దిల్లీ ప్రజలను రక్షించడానికి అరవింద్ కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వాని నడపడానికి ప్రయత్నిస్తాను." అని ఆతిశీ అన్నారు.
మద్యం విధానం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు గత శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన కేజ్రీవాల్ 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. న్యాయస్థానం నుంచి న్యాయం దక్కిందనీ, ప్రజల నుంచి న్యాయం జరగాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలు తమను నిజాయతీ పరులుగా అంగీకరించేవరకు సీఎం సీటులో కూర్చోబోనని కేజ్రీవాల్ చెప్పారు.
ఈ క్రమంలో తదుపరి సీఎం రేసులో పార్టీ కీలక నేతలు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ చద్దా, కైలోశ్ గహ్లోత్‌తో పాటు కేజ్రీవాల్ సతీమణి సునితా కేజ్రీవాల్ పేర్లు వినిపించాయి. ఈ రెండు రోజులు పార్టీ ముఖ్యనేతలతో కేజ్రీవాల్ అనేక సమావేశాలు నిర్వహించారు. చివరికి ఆతిశీని ముఖ్యమంత్రిగా ఆప్ ఎంపిక చేసింది. మంగళవారం సాయంత్రం నాలుగున్నరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించనున్నారు.
'సునీతాకు ఇంట్రెస్ట్ లేదు'
అంతకుముందు, దిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక చేసే విషయంపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మట్లాడారు. మంత్రి మండలి నుంచి ఎవరో ఒకరు సీఎం అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల గురించి నాకు అర్థమైనంత వరకు సునీతా కేజ్రీవాల్ సీఎం అయ్యే ఛాన్స్ లేదని చెప్పారు. ఆమెకు ఆసక్తి లేదని చెప్పారు.
ప్రమాణ స్వీకారం అప్పుడేనా?
సెప్టెంబరు 26-27 తేదీల్లో దిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఆ సమయంలోనే ఆతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి డిప్యూటీ సీఎంగా ఎవరినీ ప్రకటించే అవకాశాలు లేవని తెలుస్తోంది.