Delhi Namaz Incident Police : దిల్లీలోని ఇందర్‌లోక్ ప్రాంతంలో రోడ్డుపై నమాజ్ చేస్తున్న పలువురు వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐ సస్పెండ్ అయ్యారు. ఎస్ఐ దురుసు ప్రవర్తనకు సంబంధించి వైరల్ అయిన వీడియోపై దర్యాప్తు చేపట్టి అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఇందర్‌లోక్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది
ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్ సమీపంలోని కొందరు వ్యక్తులు శుక్రవారం మధ్యాహ్నం రోడ్డుపై నమాజ్ చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎస్ఐ వారితో దురుసుగా ప్రవర్తించారు. వెంటనే స్థానికులు స్పందించి రోడ్డును దిగ్బంధించారు. పోలీసుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నతాధికారుల దృష్టికి వీడియో చేరింది.
వెంటనే దిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎంకే మీనా దర్యాప్తు చేపట్టారు. దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీడియోపై విచారణ చేపట్టిన తర్వాత చర్చలు తీసుకున్నట్లు వెల్లడించారు. అంతకుముందు డీసీపీ వెళ్లి నిరసనకారులను కలిసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు, ఈ ఘటన అవమానకరమని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. "రోడ్డుపై నమాజ్ చేస్తున్న వారితో పోలీసు దురుసు ప్రవర్తన. ఇంతకంటే అవమానకరం ఏముంటుంది?" అని ప్రశ్నించింది.
ప్రజలతో దురుసు ప్రవర్తన- పోలీసులపై వేటు
ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ప్రజలతో దురుసుగా ప్రవర్తించిన అసిస్టెంట్ ఎస్ఐతోపాటు నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్థానికుల ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ సుధీర్ కుమార్ తెలిపారు.
డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, మూవోయిస్టుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల పికెట్లను ఏర్పాటు చేసింది. అయితే ఘట్‌సిల సబ్ డివిజన్‌లోని కేసర్‌పుర్, గూడజోర్ గ్రామాలకు చెందిన ప్రజలు తమతో దురుసుగా ప్రవర్తించిన ముగ్గురు కానిస్టేబుళ్లపై మార్చి 5న ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న ఎస్ఎస్ఎస్పీ కిషోర్ కౌశల్ దర్యాప్తు చేపట్టారు. కేసర్‌పుర్ పోలీసు పికెట్ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు పశుపతి మహతో, సాధన్ పాల్, నారాయణ్ మహతోను సస్పెండ్ చేశారు. మరోవైపు, టాటా స్టీల్ యుటిలిటీస్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ ఎలక్ట్రీషియన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఓంప్రకాశ్ సింగ్‌పై కూడా సస్పెన్షన్ విధించారు.