Bihar Hooch Tragedy Deaths : బిహార్‌లో కల్తీ మద్యం తాగి 32 మంది మరణించారు. మంగళవారం రాత్రి రాష్ట్రంలోని సివాన్, సారణ్ జిల్లాలకు చెందిన పలువురు కల్తీ మద్యం తాగి అనారోగ్యం పాలయ్యారు. బుధవారం నాటికి మృతుల సంఖ్య ఆరు ఉండగా, గురువారం ఆ సంఖ్య 32 చేరింది. పలువురు బాధితులకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ముగ్గురు అరెస్ట్
కల్తీ మద్యం ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చాప్రా సూపరింటెండెంట్ ఆశిష్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశామని, ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. మస్రాక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ నుంచి వివరణ కోరినట్లు వెల్లడించారు. భగవాన్‌పుర్ ఎస్హెచ్ఓతోపాటు ఎఎస్‌ఐపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు.
'చట్టం అమల్లో ఉంటే కల్తీ మద్యం ఎక్కడిది?'
రాష్ట్రంలో నిషేధం ఉండగా కల్తీ మద్యం ఎలా అందుబాటులోకి వచ్చిందని ప్రతిపక్ష ఆర్‌జేడీ ప్రశ్నించింది. నీతీశ్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. బిహార్‌లో మద్యపాన నిషేధ చట్టం అమల్లో ఉన్నప్పటికీ, కల్తీ మద్యం దొరకడం ఆందోళన కలిగించే విషయమని ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారీ అన్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని తెలిపారు. లిక్కర్ మాఫియాకు రాష్ట్ర ప్రభుత్వ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. అందుకే మద్యపాన నిషేధ చట్టం ఉల్లంఘన జరుగుతున్నట్లు ఆరోపణలు చేశారు.
#WATCH | Patna: On the death of 20 people after consuming spurious liquor in Siwan district, RJD leader Mrityunjay Tiwari says, " people have lost their lives by drinking spurious liquor. it is very sad and a matter of concern that despite the liquor ban law being in force in… pic.twitter.com/SkAZLRsA98
— ANI (@ANI) October 17, 2024
'ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టేది లేదు'
ప్రతిపక్షం చేసిన ఆరోపణలుపై బీజేపీ స్పందించింది. బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉందని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ తెలిపారు. కొందరు లిక్కర్ మాఫియా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. సీఎం నితీశ్ కుమార్ చాలా కఠినంగా వ్యవహరించనున్నారని వెల్లడించారు. సివాన్-ఛాప్రాలో చాలా మంది కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోవడం బాధకరమని అన్నారు.