CRPF Jawans Killed In Manipur : జాతుల మధ్య వైరంతో గతేడాది అట్టుడికిన మణిపుర్‌లో మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపుర్ జిల్లాలో భద్రతాసిబ్బందిపై మిలిటెంట్లు జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ, ఓ హెడ్‌కానిస్టేబుల్ అమరులయ్యారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో భాగంగా అవుటర్ మణిపుర్ స్థానానికి శుక్రవారం పోలింగ్ జరిగింది.
నరన్‌సైనా ప్రాంతంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న సీఆర్పీఎఫ్ బృందం శుక్రవారం రాత్రి ఇండియా రిజర్వ్ బెటాలియన్ శిబిరంలో బస చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత మిలిటెంట్లు కొండపైనుంచి వారిపై దాడికి తెగబడ్డారు. అర్ధరాత్రి 12.30గంటలకు మొదలైన కాల్పులు దాదాపు 2.30 గంటలు సాగినట్లు అధికారులు తెలిపారు. సైనిక శిబిరంపైకి బాంబులు కూడా విసిరినట్లు చెప్పారు. అందులో ఒకటి బెటాలియన్ అవుట్ పోస్టు వద్ద పేలినట్లు తెలిపారు. మిలిటెంట్ల దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ సర్కార్, హెడ్ కానిస్టేబుల్ అరూప్ సైనీ అమరులైనట్లు అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు చెప్పారు. మిలిటెంట్ల కోసం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
'జవాన్ల త్యాగం వృథా కాదు'
ఈ దాడిని మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. 'బిష్ణుపుర్ జిల్లాలోని నరన్‌సైనా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో శాంతి నెలకొల్పడానికి అంకితభావంతో రేయింబవళ్లు పని చేసే భద్రతా సిబ్బందిపై ఇలాంటి చర్యలు పిరికితనానికి నిదర్శనం. వారి త్యాగం వృథా కాదు'
కమాండింగ్ ఆఫీసర్ కిడ్నాప్
గత నెల మణిపుర్‌లో ఓ సైనికాధికారి అపహరణకు గురవడం తీవ్ర కలకలం రేపింది. సైన్యంలో జూనియర్ కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కోన్సామ్ ఖేడాసింగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు, ఆయన ఇంట్లోంచి బలవంతంగా తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు జాతీయ రహదారిపై చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాయి. ఆ రోజు సాయంత్రం ఆయనను రక్షించాయి భద్రతా దళాలు. బాధితుడు సెలవులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఎన్నికల వేళ మమతకు మరో గాయం- హెలికాప్టర్ సీటులో కూర్చుంటూ! - Mamata Banerjee Injured