Council Of Ministers Meeting Today : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమనే ధీమాతో ఉన్న ప్రధాని మోదీ, మూడో విడత సర్కారులో చేపట్టాల్సిన పనులపై ఇప్పటి నుంచే దృష్టి సారించారు. వికసిత్ భారత్-2047 దార్శనిక పత్రం, వచ్చే ఐదేళ్లకు వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికపై మంత్రిమండలిలో సుదీర్ఘంగా చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వంద రోజుల్లో తక్షణమే చేపట్టాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన తీరుపై మంత్రులతో సమాలోచనలు జరిపారు.
2వేల మీటింగ్స్- 20లక్షల సూచనలు
గత రెండేళ్లుగా అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల ద్వారా వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించి, వికసిత్ భారత్‌కు మార్గసూచి తయారు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వివిధ స్థాయిల్లో 2వేల 700కుపైగా సమావేశాలు, వర్క్‌షాప్స్, సెమినార్లు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వివరించారు. యువత నుంచి 20 లక్షలకుపైగా సూచనలు స్వీకరించామని వెల్లడించారు. జాతీయ దృష్టి కోణం, ప్రజలు ఆకాంక్షలు, మెరుగైన ఆర్థిక వృద్ధిరేటు, సమ్మిళిత అభివృద్ధి, సులభతర వాణిజ్యం, నివాసం, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమానికి సంబంధించి స్పష్టమైన మార్గసూచిని తయారు చేసినట్లు వెల్లడించారు. తాజా కేబినెట్ భేటీలో పలు మంత్రిత్వశాఖలు తమ ఆలోచనలను ప్రధానితో పంచుకున్నట్లు తెలిపారు. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో మోదీ సర్కారుకు ఇది తుది మంత్రిమండలి భేటీగా భావిస్తున్నారు.
అంతకుముందే కొత్త ప్రభుత్వం కోసం అంచనా వేయగల, అమలు చేయగల, స్పష్టమైన నిర్వచణతో కూడిన ప్రణాళికను మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెట్టాల్సిందిగా ప్రధాని మోదీ కోరారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనే మంత్రులకు సూచించారు ప్రధాని మోదీ. అందుకోసం సీనియర్ బ్యూరోక్రాట్, డొమైన్ నిపుణులతో సహా కిందిస్థాయిలో పని చేసే వారితోనూ విస్తృతంగా సంప్రదింపులు జరపాలన్నారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికలో మూడోసారి కూడా బీజేపీ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 సీట్లు, మొత్తంగా ఎన్డీఏ కూటమికి 400 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మార్చి 9 తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.