Amit Shah On Rahul Gandhi : దేశంలో భారతీయ జనతా పార్టీ ఉనికిలో ఉన్నంత కాలం మతపరమైన రిజర్వేషన్లు ఉండవని బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఓబీసీలు, దళితులు, గిరిజనుల రిజర్వేషన్ పరిమితిని తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపించారు. భారత రాజ్యాంగంలో ఎక్కడా మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే నిబంధనలు లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను ఓబీసీ వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఝార్ఖండ్‌లోని పాలములో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు.
'రాహుల్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు'
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నకిలీ రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ దాన్ని అపహాస్యం చేశారని అమిత్ షా దుయ్యబట్టారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ మత ఆధారిత రిజర్వేషన్లను ఎప్పటికీ అనుమతించదని పేర్కొన్నారు. "రాహుల్ గాంధీ ఓ ఎన్నికల ర్యాలీలో రెండు రోజుల క్రితం రాజ్యాంగం కాపీని చూపించారు. అది నకిలీది. అందులో ఎలాంటి కంటెంట్ లేదు. కాపీ కవర్‌పై మాత్రమే భారత రాజ్యాంగం అని రాసి ఉంది. రాహుల్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. నకిలీ రాజ్యాంగ ప్రతి చూపి రాహుల్ బీఆర్ అంబేడ్కర్, రాజ్యాంగ పరిషత్‌ను అవమానించారు. మోదీ సర్కార్ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఏటా నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. గాంధీల నాలుగో తరం వచ్చి అడిగినా ఆర్టికల్ 370ని పునరుద్ధరించే అవకాశం లేదు" అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
'జేఎంఎం కూటమి దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం'
ఓబీసీలు, గిరిజనులు, దళితుల నుంచి రిజర్వేషన్లు లాక్కొని, మైనారిటీలకు ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోందని అమిత్ షా ఆరోపించారు. ఓబీసీ కోటాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహారాష్ట్రలోని కొన్ని వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అయితే మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు మోదీ నాయకత్వంలోని బీజేపీ వ్యతిరేకమని తెలిపారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) సంకీర్ణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయ సర్కారుగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పెరుగుతున్న అక్రమ చొరబాటుదారుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది తమ పొలిటికల్ అజెండా అని సీఎం హేమంత్ సోరెన్ విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. సోరెన్ వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని విమర్శించారు. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తామని అమిత్ షా హెచ్చరించారు.
#WATCH | Hazaribag, Jharkhand: Union Home Minister Amit Shah says, " ...the congress, jmm government is the most corrupt government in the entire country. it needs to be changed... if you want to stop this corruption, then uproot the jharkhand mukti morcha and congress government.… pic.twitter.com/luSadEbOLa
— ANI (@ANI) November 9, 2024
'దేశంలో పేదలను దోచుకునేలా పన్ను విధానం'
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ పేదలను దోచుకునేలా పన్ను విధానాన్ని రూపొందించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోడీ సీ-ప్లేన్‌లో సముద్రంలో ప్రయాణిస్తారని, కానీ పేదలు, మహిళలు అధిక ధరల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఝార్ఖండ్‌లో బగ్మారాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"భారత్‌లో ప్రస్తుతం ఉన్న పన్నుల విధానం పేదలను దోచుకోవడం కోసమే. రూ.లక్ష కోట్ల విలువైన ధారవి భూమిని అదానీకి అప్పగిస్తున్నారు. దేశ జనాభాలో ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు దాదాపు 90 శాతం ఉన్నారు. అయితే వారికి ప్రభుత్వ సంస్థల్లో ప్రాతినిధ్యం లేదు. ప్రధాని మోదీ పారిశ్రామికవేత్తలకు చేసిన రుణాల మాఫీని సమానమైన నిధులను పేదలకు అందజేస్తాం" అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.