Congress Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికలను హస్తం పార్టీ పేదలు వర్సెస్ ధనికులుగా భావించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి మూడ్ అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో 'ఇండియా' కూటమి సంపూర్ణ మెజార్టీ సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ చాలా సీట్లు కోల్పోతుందని అంచనా వేశారు. క్షేత్ర స్థాయిలో ఈసారి బీజేపీకి గానీ, ప్రధాని నరేంద్ర మోదీకి గానీ ఎలాంటి వేవ్ లేదని పేర్కొన్నారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీ వేణుగోపాల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"ఇండియా కూటమికి లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ వస్తే ప్రధానమంత్రి అభ్యర్థిని ఎటువంటి ఆలస్యం చేయకుండా నిర్ణయిస్తాం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పారదర్శకత లోపించింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలంటే ఈసీ తటస్థంగా, రిఫరీగా ఉండాలి. సమాజంలో మత విభజన కోసం అధికార బీజేపీ కథనాలు సృష్టించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ వైఖరి పూర్తిగా నియంతృత్వ ధోరణిలో ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజా సమస్యలపైనే పోరాడాలని కాంగ్రెస్ పార్టీ గట్టి నిర్ణయం తీసుకుంది. అందుకే ఈ ఎన్నికలను హస్తం పార్టీ పేదలు వర్సెస్ ధనికులుగా భావించింది. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఇండియా కూటమికి అనుకూలంగా మూడ్ ఉంది. యూపీ, బిహార్, రాజస్థాన్, హరియాణా, కర్ణాటకలో ఈ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు భారీగా తగ్గుతాయి. అసోంలో కూడా ఇండియా కూటమికి సానుకూల ఫలితాలు వస్తాయి" అని కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
'ఏకపక్ష నిర్ణయాలు తీసుకోం'
ఇండియా కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ అయినప్పటికీ ప్రధాని అభ్యర్థి ఎంపికలో ఎటువంటి ఏకపక్ష నిర్ణయం తీసుకోమని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టడం, పార్టీ ఖాతాలను స్తంభింపజేయడం వంటి చర్యలకు బీజేపీ పాల్పడిందని ఆరోపించారు. ముస్లింలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పిస్తుందన్న మోదీ వాదనను కొట్టిపారేశారు.
"కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ప్రతి ఎన్నికల ప్రసంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలే అంటున్నారు. ఇండియా కూటమి తమ ఎన్నికల ఏజెంట్లను దేశవ్యాప్తంగా 17-సీ ఫారమ్‌ను సేకరించాలని కోరింది. తద్వారా ఓటర్ల డేటాను తెలుసుకోవచ్చు. రాహుల్ గాంధీ రెండు స్థానాల్లోనూ గెలిస్తే ఏ స్థానాన్ని వదిలేయాలనేది ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. సినిమా చూసిన తర్వాతే మహాత్మా గాంధీ గురించి ప్రజలకు తెలుసని ప్రధాని అంటున్నారు. ఇది నిజమేనా? నా దృష్టిలో అది నిజం కాదు. అదే విధంగా ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కూడా అబద్ధమే" అని కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
'48 గంటల్లోగా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎంపిక- వారికే ఛాన్స్!' - Lok Sabha Elections 2024