Jammu Kashmir Election 2024 Congress : జమ్ముకశ్మీర్ ఎన్నికల వేళ అక్కడి ప్రజలపై కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఐదు సంక్షేమ పథకాల వివరాలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. దక్షిణకశ్మీర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాలొన్న ఆయన ఈ మేరకు ఐదు గ్యారెంటీలను ప్రకటించారు.
- మహిళా పారిశ్రామికవేత్తలకు ఐదు లక్షల వడ్డీ లేని రుణం.
- ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా
- ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి వ్యక్తికి 11 కిలోల ధాన్యం
- కశ్మీర్ పండిట్ వలసదారులకు పునరావాసం
- కుటుంబంలో మహిళా పెద్దకు నెలకు రూ.3,000
ఐదు గ్యారెంటీల ప్రకటన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఖర్గే. బీజేపీ చాలా మాట్లాడుతుందని, చర్యలు తీసుకునే విషయం వచ్చేసరికి ఏం ఉండదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంత ప్రయత్నించినా, కాంగ్రెస్- ఎన్సీ కూటమి బలహీనపడదని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తుందనేది అబద్ధం అని ఆరోపించారు. గతంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన వాళ్లు, ఇప్పుడు ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. వాగ్దానం చేసిన పదేళ్లలో జమ్ముకశ్మీర్లో లక్ష మందిని రిక్రూట్ చేసుకోలేనివారు, ఐదు లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఇక్కడి ప్రజల తరఫున స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు పోరాడుతుందన్నాయని తెలిపారు. అలాంటి పార్టీలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
"మేం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. బీజేపీ ఏ పరిశ్రమను తీసుకురాలేదు. అందువల్ల ఉద్యోగ కల్పన జరగలేదు. మేం అధికారంలోకి వస్తే పర్యటకంతో పాటు ఉత్పత్తిపై దృష్టి పెడతాం. గత కొన్ని సంవత్సరాల్లో 4400కుపైగా ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు. వాటిని తిరిగి తెరుస్తాం" అని కాంగ్రెస్ అధ్యక్షుడు హామీ ఇచ్చారు.