Cong Chief Writes To President Murmu On Manipur Situation : మణిపుర్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని వెంటనే జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు రాష్ట్రపతికి రెండు పేజీల లేఖ రాశారు. మణిపుర్ ప్రజలు ప్రశాంత వాతావరణంలో, గౌరవంగా తమ ఇళ్లలో జీవించేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రపతి ముర్మును కోరారు. గత 18 నెలలుగా మణిపుర్ ప్రజలకు భద్రత కల్పించడంలోనూ, శాంతిభద్రతల పరిరక్షణలోనూ కేంద్రం, మణిపుర్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఖర్గే ఆరోపించారు. హింసాత్మక ఘటనల్లో మహిళలు, పిల్లలు, నవజాత శిశువులు సహా 300 మంది ప్రాణాలు కోల్పోయారని ఖర్గే పేర్కొన్నారు. పైగా లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, బలవంతంగా తమ ఇళ్లను వదిలి శిబిరాల్లో తలదాచుకుంటున్నారని రాష్ట్రపతికి రాసిన లేఖలో ఖర్గే వివరించారు.
రక్షణ కల్పించండి!
మణిపుర్ ప్రజల వేదన కొనసాగుతూనే ఉందని ఖర్గే ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షకురాలిగా వెంటనే జోక్యం చేసుకుని మణిపుర్ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని ఖర్గే రాష్ట్రపతిని కోరారు. రాష్ట్రపతి జోక్యంతో మణిపుర్ ప్రజలు మళ్లీ తమ ఇళ్లలో గౌరవంగా, ప్రశాంత వాతావరణంలో జీవించే పరిస్థితులు తిరిగి నెలకొంటాయని ఖర్గే ఆశాభావం వ్యక్తంచేశారు.
మణిపుర్ సీఎం రాజీనామా చేయాల్సిందే: ఇరోమ్ షర్మిల
మణిపుర్‌లో శాంతిభద్రతలు పునరుద్ధరించడంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పూర్తిగా విఫలమయ్యారని పౌరహక్కుల నేత, మణిపుర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు బాధ్యత వహిస్తూ, వెంటనే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని, ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.
మోదీ సర్కార్ తీరును కూడా ఇరోమ్ షర్మిల తప్పుబట్టారు. మూడోసారి ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తున్నారని, కానీ, మణిపుర్ ఎందుకు రావడం లేదని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని, అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాలన్నారు. మోదీ జోక్యం చేసుకుంటేనే మణిపుర్ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.