Centre files affidavit before SC : ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ యూజీ పరీక్షను పూర్తిగా రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. నీట్‌ను రద్దు చేయడం హేతుబద్ధం కాదని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ ప్రవేశ పరీక్ష అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని తెలిపింది. అన్ని పోటీ పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొంది. నీట్‌ను రద్దు చేస్తే లక్షల మంది నష్టపోతారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
'నీట్ రద్దు సహేతుకం కాదు'
నీట్‌ను పూర్తిగా రద్దు చేస్తే నిజాయతీ కలిగిన అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని కేంద్రం, సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాల్లేవని చెప్పింది. అలాంటప్పుడు మొత్తం పరీక్షను, ఇప్పటికే విడుదలైన ఫలితాలను రద్దు చేయడం సహేతుకం కాదని పేర్కొంది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
జూన్ 8న పిటిషన్లపై విచారణ నేపథ్యంలో కేంద్రం అఫిడవిట్
దేశంలోని వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నిర్వహించిన నీట్-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలనే డిమాండ్లు వస్తున్నాయి. నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో దాదాపు 26 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం జులై 8న విచారించనుంది. పలు కోచింగ్ సెంటర్లు, నీట్ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సమాధానం కోరుతూ ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
మరోవైపు, నీట్ పరీక్ష రద్దు చేయొద్దని కోరుతూ గురువారం 56 మంది నీట్ ర్యాంకర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జులై 8న సీజేఐ ధర్మాసనం విచారణ జరపనుంది.
'ప్రధాని మోదీ, అమిత్ షా భేష్!'- CBI దర్యాప్తును స్వాగతించిన IMA - NEET UG 2024 ISSUE