NEET Paper Leak CBI Chargesheet : నీట్ యూజీ పరీక్ష 2024 పేపర్ లీక్ కేసులో 13 మందిని నిందితులుగా పేర్కొంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ మేరకు అధికారులు గురువారం తెలిపారు. నిందితులు పేపర్ లీక్ సహా ఇతర అక్రమాలకు పాల్పడ్డారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ విషయంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్, సికిందర్ యాద్వెందు, అశుతోష్ కుమార్-1, రోషన్ కుమార్, మనీశ్ ప్రకాష్, అశుతోష్ కుమార్-2, అఖిలేష్ కుమార్, అవదేశ్ కుమార్, అనురాగ్ యాదవ్, అభిషేక్ కుమార్, శివానందన్ కుమార్, ఆయుష్ రాజ్‌పై అభియోగాలు మోపామని సీబీఐ తెలిపింది. ఈ కేసులో బిహార్ పోలీసులు అరెస్టు చేసిన 15మందితో సహా ఇప్పటివరకు 40 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొంది. 58 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించింది.
సుప్రీం కోర్టు తీర్పు
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను మళ్లీ జరపాలన్న డిమాండ్లను సుప్రీంకోర్టు గత నెల తిరస్కరించింది. వ్యవస్థాగతమైన లీకేజీ, ఇతర అక్రమాలకు సంబంధించి అధికారిక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో మళ్లీ పరీక్ష జరపాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ Jbపర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు, వ్యవస్థాగతమైన ఉల్లంఘన జరిగిందని చెప్పటానికి ఆధారాలు లేవని పేర్కొంది.
"ఝార్ఖండ్‌లోని హజారీబాగ్, బిహార్‌లోని పట్నాలోని కేంద్రాల్లో నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకైందన్న మాట వాస్తవం. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 155 మంది లబ్ధిపొందినట్లు తెలుస్తోంది. ఈ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలి. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు. వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధరణకు రావడం ప్రస్తుత దశలో కష్టం. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారు. వారిలో అనేకమంది వందల కి.మీల దూరం ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు" అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
ఇదీ కేసు
కాగా, ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్-యూజీ పరీక్ష జరిగింది. 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు సుమారు 23లక్షల మందికి పైగా హాజరయ్యారు. అయితే, ఇందులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.