Kolkata Doctor Case CBI Charget Sheet : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సీబీఐ కీలక సాక్ష్యాలను పొందుపర్చింది. డీఎన్ఏ, రక్తపు నమూనాలు సహా 11 రుజువులను అందులో ప్రస్తావించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సివిక్ వాలంటీర్ సంజయ్‌రాయ్‌కు సంబంధించిన డీఎన్ఏ మృతిచెందిన వైద్యురాలి శరీరంపై లభ్యమైనట్లు అభియోగపత్రంలో సీబీఐ పేర్కొంది. ఘటనాస్థలంలో లభ్యమైన వెంట్రుకలు, బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నిందితుడివేనని తెలిపింది. మృతురాలి రక్త నమూనాలు సంజయ్‌రాయ్ దుస్తులు, చెప్పులపై లభ్యమైనట్లు రుజువులను అభియోగపత్రంలో పేర్కొంది.
ఆ నమునాలు నిందితుడివే
ఆర్జీ కర్ ఆస్పత్రిలో ఆగస్టు 9వ తేదీన ఈ హత్యాచార జరగగా, నిందితుడు సంజయ్‌రాయ్‌ను ఆగస్టు 10వ తేదీన కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 8, 9 తేదీల్లో సంజయ్‌రాయ్ ఆస్పత్రిలోనే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా సాక్ష్యాలుగా సీబీఐ సమర్పించింది. మృతురాలి రక్త నమూనాలు నిందితుడు సంజయ్‌రాయ్ జీన్స్, చెప్పులపై లభ్యమైనట్లు తెలిపింది. నిందితుడి దుస్తులు, ఫుట్‌వేర్‌ను ఆగస్టు 12వ తేదీన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలిలో లభ్యమైన వెంట్రుకలు నిందితుడు సంజయ్‌రాయ్‌తో సరిపోలినట్లు సీబీఐ పేర్కొంది. అంతేకాకుండా హత్యాచార ఘటనలో బాధితురాలు ప్రతిఘటించగా నిందితుడు సంజయ్‌రాయ్‌కు కొన్ని గాయాలయ్యాయి. వాటిని కూడా రుజువులుగా ఛార్జిషీట్‌లో తెలిపింది.
బ్లూటూత్ ఇయర్ఫోన్తో నిందితుడు
ఇక ఘటన జరిగిన ప్రదేశంలో లభ్యమైన బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నిందితుడు మొబైల్ ఫోన్‌తో అనుసంధానం అవుతున్నట్లు సీబీఐ తెలిపింది. ఈ సాక్ష్యాలను సంబంధించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ పరిశోధనశాల రిపోర్ట్స్‌ను అభియోగపత్రంలో పేర్కొంది. ఆగస్టు 8, 9వ తేదీల్లో సంజయ్‌రాయ్ ఆస్పత్రిలో తిరుగుతూ ఉన్నప్పుడు బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నెక్‌బ్యాండ్‌తో అతను కనిపించినట్లు చెప్పింది. అయితే, హత్యాచార ఘటన జరిగిన తర్వాత లిఫ్ట్ వద్దకు సంజయ్‌రాయ్ వెళ్లినప్పుడు అతని వద్ద బ్లూటూత్ ఇయర్‌ఫోన్ మిస్సైనట్లు పేర్కొంది.
గొంతు నులమడం, ఉక్కిరిబిక్కిరి చేయడమే వైద్యురాలు మృతికి కారణమని సీబీఐ ఛార్జీషీట్లో తెలిపింది. వైద్యురాలి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించే సమయంలో ఆమె శరీరమంతా రిగర్ మోర్టిస్ ఉందని, పోస్ట్‌మార్టం జరగడానికి 12 నుంచి 18 గంటల ముందు ఆమె మరణించినట్లు అది సూచిస్తుందని వెల్లడించింది. మృతిరాలిపై బలవంతపు లైంగిక చర్య జరిగినట్లు లభ్యమైన ఆధారాలను కూడా అభియోగపత్రంలో పొందుపర్చింది. వైద్యురాలి శరీరంపై లభ్యమైన లాలాజలం సంజయ్‌రాయ్‌దే అని డీఎన్ఏ నివేదికలో తేలినట్లు తెలిపింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)కింద సంజయ్‌రాయ్‌పై వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదైంది.