CBI About Kolkata Doctor Case Accused : కోల్‌కతా జునియర్ వైద్యురాలి హత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను విచారిస్తోంది. నిందితుడు అశ్లీల చిత్రాలకు బానిసగా మారాడని, వక్రబుద్ధి కలిగిన వాడని ఓ సీబీఐ అధికారి పేర్కొన్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి చెందిన వైద్య బృందం విశ్లేషించిన నిందితుడి మానసిక తీరును(Psychoanalytic Profile) ఉటంకిస్తూ వివరాలు వెల్లడించారు. ఫోరెన్సిక్ వైద్య బృందం చెప్పిన విషయాలను ప్రస్తావించిన ఆయన అతడిలో పశు ప్రవృత్తి కనిపించిందన్నారు.
"నిందతుడు సంజయ్ రాయ్‌లో పశ్చాత్తాపం లేదు. ప్రతి నిమిషం జరిగిన విషయాలను గుక్కతిప్పకుండా మొత్తం ఎపిసోడ్‌ను వివరించాడు. దాన్ని బట్టి చూస్తే అతనికి ఎటువంటి పశ్చాత్తాపం లేనట్లు అనిపించింది. అయితే, నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి బలమైన సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలున్నాయి. ఆగస్టు 8 ఉదయం 11గంటలకు శ్వాసకోశ విభాగం సమీపంలో నిందితుడు కనిపించాడు. ఆగస్టు 9 తెల్లవారుజామున 4గంటలకు మళ్లీ అదే బిల్డింగ్‌లోకి వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డ్ అయ్యింది" అని ఓ సీబీఐ అధికారి తెలిపారు.
అయితే, సంజయ్ రాయ్ డీఎన్‌ఏ పరీక్షలకు సంబంధించిన విషయాలపై సదరు సీబీఐ అధికారి ఏమీ మాట్లాడలేదు. బాధిత వైద్య విద్యార్థిపై సామూహిక అత్యాచారం జరిగిందని వస్తోన్న వార్తలపై కూడా వ్యాఖ్యానించేందుకు అధికారి నిరాకరించారు. దర్యాప్తులో భాగంగా భవానీపుర్‌లోని నిందితుడు సంజయ్ నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు అతడి కుటుంబ సభ్యులు, పొరుగువారితోపాటు అతడితో కలిసి పనిచేసే వారినీ విచారించారు.
ఆర్జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్‌లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థిని విగత జీవిగా కనిపించి ఉండటాన్ని గుర్తించారు. మొదట ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ హత్యాచారమని దర్యాప్తులో తేలింది. వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్ రాయ్‌ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్టు చేశారు. అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించగా అనేక అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
అనాథ శవాలనూ వదలని ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ - సిట్ విచారణలో సంచలన విషయాలు! - kolkata doctor case