CAA Portal India How To Apply : లోక్సభ ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలోనే సీఏఏ కింద దరఖాస్తుల స్వీకరణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం కొత్త వెబ్ పోర్టల్ https:/indiancitizenshiponline.nic.inను ప్రారంభించింది.
దీంతో పాటు CAA-2019 పేరుతో మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కేంద్రం ఈ చట్టం తెచ్చింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. మరి ఈ చట్టం కింద పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
- ముందుగా https:/indiancitizenshiponline.nic.in వెబ్‌పోర్టల్‌కు వెళ్లాలి.
- సీఏఏ, 2019 కింద భారత పౌరసత్వం కోసం అప్లికేషన్ సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేస్తే నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది.
- అక్కడ పేరు, మెయిల్ ఐడీ ఇతర వివరాలను నమోదు చేసి సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- వివరాలన్నింటినీ సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ ఈమెయిల్, మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీని వెరిఫై చేసిన తర్వాత ఎక్స్ట్రా వెరిఫికేషన్ కోసం క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- వెరిఫికేషన్ పూర్తైన తర్వాత మీ పేరుతో లాగిన్ అయి కొత్త అప్లికేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి
- అక్కడ మీ బ్యాక్‌గ్రౌండ్, ఏ దేశానికి చెందిన వారు? భారత్‌కు ఎప్పుడు వచ్చారు? ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానమిచ్చి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలి.
కావాల్సిన పత్రాలివే
అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ప్రభుత్వాలు జారీ చేసిన పాస్‌పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రం లేదా ఇతర గుర్తింపు పత్రాలను పౌరులు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు 2014 డిసెంబరు 31వ తేదీకి ముందే భారత్‌లోకి ప్రవేశించారని రుజువు చేసే డాక్యుమెంట్లను ఇవ్వాలి. అంటే దేశానికి వచ్చిన సమయంలో వీసా కాపీ, ఇమ్మిగ్రేషన్ స్టాంప్, భారత్‌లో జారీ చేసిన రేషన్ కార్డు, ఇక్కడే జన్మిస్తే జనన ధ్రువీకరణ పత్రం, రిజిస్టర్డ్ రెంటల్ అగ్రిమెంట్, పాన్ కార్డు, విద్యుత్ బిల్లులు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, మ్యారేజీ సర్టిఫికేట్ ఇలా ఏదైనా గుర్తింపు కార్డును సమర్పించాలి.
సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్
మరోవైపు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై కొన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమైందంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని అమలుకు విరామం ఇవ్వాలంటూ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2019లో కూడా సీఏఏను సవాలు చేస్తూ ఐయూఎంఎల్ సుప్రీం మెట్లెక్కింది. నిబంధనలు ఇంకా నోటిఫై చేయకపోవడం వల్ల ఆ చట్టం అమల్లోకి రాదని అప్పట్లో కేంద్రం కోర్టుకు వెల్లడించింది. తాజాగా నిబంధనలు నోటిఫై చేయడం వల్ల మళ్లీ ఆ అంశం కోర్టుకు చేరింది. ఆ చట్టం రాజ్యాంగ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 250 పిటిషన్లపై తీర్పు వచ్చేవరకు దాని అమలుపై స్టే విధించాలంటూ తన పిటిషన్‌లో కోరింది.
'ఎన్నికల ముందు ఓట్లు చీల్చే ప్రయత్నం'- CAA అమలుపై విపక్షాలు ఫైర్