Bournvita Is Not A Health Drink : బోర్నవిటాతో పాటు ఇతర సంబంధిత ఉత్పత్తులను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఇ-కామర్స్ కంపెనీలను ఆదేశించింది. 2006లో తీసుకొచ్చిన ఆహార భద్రతా, ప్రమాణాల చట్టంలో హెల్త్ డ్రింక్‌కు సరైన నిర్వచనం లేదని జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ విచారణలో వెల్లడైందని కేంద్రం ఏప్రిల్ 10న జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలోనే అన్ని ఇ-కామర్స్ కంపెనీలు, పోర్టళ్లు బోర్నవిటా సహా ఇతర సంబంధిత ఉత్పత్తులను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఓ సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ బోర్నవిటాపై గతేడాది ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ హెల్త్ డ్రింక్‌లో అధిక స్థాయిలో షుగర్ కంటెంట్ ఉందని, కోకో పదార్థాలతో పాటు క్యాన్సర్ కారక రంగులను వినియోగించారని ఆరోపించాడు. ఈ వీడియోపై 2023 ఏప్రిల్ 13న మోండలెజ్ ఇండియా సంస్థ అతడికి నోటీసులు పంపింది. దీంతో ఆ వీడియోను డిలీట్ చేశాడు. వీడియోను తొలగిస్తున్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. అప్పటికే ఆ వీడియోను దాదాపు 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
దీంతో 'తప్పుదోవ పట్టించే' వ్యాపార ప్రకటనలు, ప్యాకేజింగ్, లేబుళ్లను ఉపసంహరించుకోవాలని మాండెలెజ్ ఇండియాకు చెందిన బోర్నవిటా బ్రాండ్‌ను జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) ఆదేశించింది. 'మీ కంపెనీ వినియోగదార్లను తప్పుదోవ పట్టిస్తూ ప్యాకేజింగ్, వ్యాపార ప్రకటనలు చేసినట్లు కమిషన్ గుర్తించింది. లేబులింగ్, ప్యాకేజింగ్, డిస్‌ప్లే, వ్యాపార ప్రకటనలు సాధారణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి' అని మాండెలెజ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్-ఇండియా దీపక్ అయ్యర్‌కు జారీ చేసిన నోటీసులో ఎన్‌సీపీసీఆర్ పేర్కొంది. ఇందులోని కొన్ని పదార్థాలు పిల్లలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ అందులో చెప్పింది. బోర్నవిటాలో అనుమతించిన దానికంటే అధికంగా చక్కెర స్థాయిలు ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. డెయిరీ సంబంధిత, మాల్ట్ ఆధారిత డ్రింకులను హెల్త్ డ్రింకులుగా లేబుల్ చేయొద్దంటూ భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ కూడా ఆదేశాలు జారీ చేసింది.