Bombay HC On Fact Check Unit Case : సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నకిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఇటీవల తీసుకొచ్చిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ (ఎఫ్‌సీయూ) అంశంలో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీటి ఏర్పాటు కోసం సమాచార సాంకేతిక నిబంధనల(ఐటీ రూల్స్)కు చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సవరణ నిబంధనలు రాజ్యాంగ అధికరణం 14 (సమానత్వ హక్కు), అధికరణం 19 (భావ ప్రకటన హక్కు), అధికరణం 19(1)(జి) (వృత్తి నిర్వహణ హక్కు)లను ఉల్లంఘిస్తున్నాయని న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ చందూర్కర్ తీర్పునిచ్చారు. ఐటీ సవరణ నిబంధనల్లో పేర్కొన్న 'నకిలీ, తప్పుడు, తప్పుదోవ పట్టించే' వంటి వాటికి ఎలాంటి నిర్వచనం లేదని, అలాంటప్పుడు వాటికి అసలు అర్థం లేదన్నారు.
ఇదీ కేసు
సామాజిక మాధ్యమాలు/పోర్టల్స్ వంటి ఆన్‌లైన్ వేదికల్లో నకిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించి, వాటిని అడ్డుకునేందుకు ఎఫ్‌సీయూలను తీసుకొస్తామని గతంలో కేంద్రం ప్రభుత్వం పేర్కొంది. అందుకోసం ఐటీ రూల్స్-2021కు పలు సవరణలు చేసింది. అయితే ఈ సవరించిన కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ నిబంధనల చెల్లుబాటును సవాల్ చేస్తూ, ప్రముఖ హాస్య నటుడు కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తదితరులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై జనవరిలో విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్, భిన్నాభిప్రాయాలతో తీర్పునిచ్చింది. ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరు సవరణ నిబంధనలను తోసిపుచ్చగా, మరో న్యాయమూర్తి వాటిని సమర్థించారు. దీనితో ఈ కేసు మూడో న్యాయమూర్తి వద్దకు వెళ్లింది. కేసును పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ చందూర్కర్ శుక్రవారం కేంద్రం చేసిన ఐటీ రూల్స్ సవరణలను కొట్టివేస్తూ, తన తీర్పును వెలువరించారు. పిటిషనర్లలో ఒకరైన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తాజా తీర్పును స్వాగతించింది.
ఎఫ్‌సీయూ ఏమి చేస్తుందంటే?
ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు ఆన్‌లైన్‌లో వచ్చిన ఏదైనా సమాచారాన్ని నకిలీ లేదా తప్పుదోవ పట్టించే సమాచారం అని నిర్ధరిస్తే, ఆ సమాచారాన్ని సామాజిక మాధ్యమ వేదికలు/పోర్టల్స్ తక్షణమే తొలగించాల్సి ఉంటుంది. లేదా ఆ అభిప్రాయాలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని (డిస్‌క్లయిమర్) పేర్కొనాల్సి ఉంటుంది. రెండో దానిని ఎంచుకుంటే ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు ఆయా వేదికలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.