BJP To Send Notice TO Over 20 MPs : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జమిలి ఎన్నికల బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన వేళ కొందరు ఎంపీలు సభకు రాకపోవటాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. వారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 20 మందికిపైగా ఎంపీలు లోక్‌సభకు గైర్హాజరైనట్లు సమాచారం.
జమిలి ఎన్నికల బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో పార్టీ ఎంపీలంతా సభలో ఉండాలని బీజేపీ విప్ జారీ చేసింది. ఆ రెండు బిల్లులు ఆమోదం పొందటానికి బీజేపీ ఎంపీల గైర్హాజరు అడ్డంకి కాకపోయినా ప్రభుత్వానికి తగినంత మద్దతు లేదని విమర్శించటానికి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినట్లు అయిందని కమలనాథులు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.
ఓటింగ్‌కు విపక్షాలు పట్టు
ఏకకాల ఎన్నికల కోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అనంతరం ఓటింగ్‌కు పట్టుబట్టాయి.
బీజేపీకి తగ్గిన మద్దతు!
అయితే బిల్లుపై ఓటింగ్‌కు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. 360 మంది ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో, మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. ఓటింగ్ నిర్వహించిన సమయంలో పలువురు బీజేపీ ఎంపీలు గైర్హాజరు అయ్యారు. అందువల్ల బిల్లుపై బీజేపీకి అనుకున్న దాని కంటే తక్కువ మద్దతు వచ్చినట్లు అయింది. ఇది విపక్షాలకు ఒక అస్త్రంగా మారింది.
జమిలి వల్ల లాభమే : అమిత్ షా
ప్రతిపక్షాలు కోరిన విధంగా జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీనే ఈ మేరకు సూచించారని తెలిపారు.
ఇదే విషయంపై ఇంతకుముందు అమిత్ షా పలు వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు కొత్తగా వచ్చింది కాదని, గతంలో కూడా భారత్‌లో ఈ విధానాన్ని అనుసరించామని పేర్కొన్నారు. దేశంలో మూడు సార్లు జమిలి ఎన్నికలు నిర్వహించామని అన్నారు. 1952లో అన్ని ఎలక్షన్స్ ఒకేసారి జరిగాయని గుర్తు చేశారు. జమిలి ఎన్నికల వల్ల దేశానికి లాభమే తప్ప నష్టం వాటిల్లదని హోం మంత్రి చెప్పారు.