BJP Mission GYAN : 'టార్గెట్ @ 400'- సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందనే విషయాన్ని చెబుతూ పార్లమెంటు వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేసిన ప్రకటన! బీజేపీకి ఒంటరిగా 370 స్థానాల్లో విజయం దక్కుతుందని, మిత్రపక్షాలతో కలుపుకుంటే తమకు 400 సీట్లపైమాటే దక్కినా ఆశ్చర్యం లేదని ఆయన ప్రకటించారు. హ్యాట్రిక్ పక్కా అంటూ చెబుతూ, మెజారిటీ మాత్రమే ఖరారు కావాల్సి ఉందనే సందేశం ఇచ్చారు.
2014లో ఎన్డీఏ కూటమి 336 స్థానాలు దక్కించుకోగా, 2019లో 353 సీట్లు గెలిచింది. అందులో బీజేపీ ఒంటరిగా 303 స్థానాలు సాధించింది. ఈ క్రమంలోనే ఈ సారి సొంతంగా 370 స్థానాలు, మిత్రపక్షాలతో కలిసి 400పైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది కమల దళం. 2019 ఎన్నికల్లో కోల్పోయిన 160 సీట్లను ఈసారి దక్కించుకోవాలని ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అనుకున్నది సాధించేందుకు మిషన్ జ్ఞాన్- GYANపై దృష్టి పెట్టింది.
అసలేంటి మిషన్ జ్ఞాన్?
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సమాజంలోని కీలక వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రధాని మోదీ రూపొందించిన పదమే GYAN. G అంటే గరీబ్ (పేద), Y అంటే యువ (యువత), A అంటే అన్నదాత (రైతులు), N అంటే నారీ(మహిళలు)గా నిర్వచించారు మోదీ. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో గెలిచిన తర్వాత దిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీటింగ్‌లో మోదీ- ఈ GYAN ప్రస్తావన తీసుకొచ్చారు. దేశంలో పేదలు, యువత, రైతులు మహిళలను మాత్రమే నాలుగు కులాలుగా మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ మిషన్ జ్ఞాన్తోనే ఎన్నికల్లోకి వెళ్లనున్నారు.
దేశంలోని ఈ నాలుగు వర్గాల అభివృద్ధిపై బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నాలుగు వర్గాలకు చేరువయ్యేందుకు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. మరోవైపు, మిషన్ జ్ఞాన్ బాధ్యతలను పార్టీ ఉపాధ్యక్షుడు బిజయంత్ పండా, జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, శివప్రకాశ్లతో సహా బీజేపీ సీనియర్లకు అధిష్ఠానం అప్పగించింది.
మహిళల కోసం మోదీ!
మిషన్ జ్ఞాన్లో భాగంగా ప్రధాని మోదీ బంగాల్ నుంచి దేశవ్యాప్తంగా మహిళలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇంకా తేదీ ఖరారు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బంగాల్‌ను సందేశ్‌ఖాలీ వ్యవహారం రాజకీయంగా కుదిపేస్తోంది. దీంతో మోదీ బంగాల్లో పర్యటించి ప్రసంగించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రైతుల వద్దకు రాజనాథ్!
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మార్చి 3వ తేదీన ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే గతకొన్ని రోజులుగా పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంతోపాటు అనేక డిమాండ్లపై రైతులు దిల్లీ చలో కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం రైతులు వారం రోజులుగా సరిహద్దుల్లోనే ఉన్నారు. ఇటీవలే చర్చల కోసం రైతులను కేంద్రం ఆహ్వానించింది. కానీ రైతు సంఘాల నేతలు నిరాకరించారు.
నడ్డా అలా- అమిత్ షా ఇలా!
మార్చి 4వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో యువతను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అదే నెల 7వ తేదీన ఓటర్లను ఉద్దేశించి మరో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మిషన్ జ్ఞాన్లో భాగంగా మార్చి 5వ తేదీన బిహార్ పట్నాలో ఓబీసీ మహాసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. అయితే ఈ మిషన్ జ్ఞాన్ కింద ప్రచార కార్యక్రమాలు మార్చి 10వ తేదీ కల్లా ముగించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించిందట.
నోటిఫికేషన్‌కు ముందే!
సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. కిసాన్ చౌపాల్ వంటి కార్యక్రమాల ద్వారా రైతులను కలుస్తున్నారు బీజేపీ నాయకులు. మహిళలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై బీజేపీ మహిళా మోర్చా ప్రచారం చేస్తోంది. ఎన్నికల నోటిపికేషన్‌కు ముందే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవలే దిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సదస్సులో పార్టీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను రూపొందించి చర్చించింది అధిష్ఠానం.