BJP Leaders Meeting : కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ముచ్చటగా మూడోసారి భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇక మోదీ కేబినెట్ మంత్రులు ఎవరనే అంశంపైనే ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు బీజేపీ అగ్రనేతలు దిల్లీలో సమావేశమయ్యారు.
గురువారం ఉదయం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ అగ్రనేతలు, ఆర్‌ఎస్‌ఎస్ కీలక నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పు, కూటమి పక్షాలతో సమన్వయంపై చర్చించారు. అలాగే కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటాపై కసరత్తు జరిగింది. ఈ సమావేశంలో అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, బీఎల్ సంతోష్, సురేష్ సోని, అరుణ్‌కుమార్, దత్తాత్రేయ హొసబెళె తదితరులు పాల్గొన్నారు. ఇక కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ ఎంపీలంతా శుక్రవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే నరేంద్ర మోదీని తమ నాయకుడిగా అధికారికంగా ఎన్నుకునే అవకాశముంది. అలాగే బీజేపీ పార్లమెంటరీ సమావేశం కూడా శుక్రవారమే జరగనుంది.
మోదీ కేబినెట్లో టీడీపీ, జేడీయూ!
ఇక ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జేడీయూ పార్టీలు కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీలకు కేబినెట్లో ప్రాధాన్యం లభించే అవకాశాలున్నట్లు సమాచారం. కేబినెట్లో టీడీపీ 5, జేడీయూ 2, జేడీస్ 1 ఇలా మంత్రి పదువులను డిమాండ్లు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీకి లోక్‌సభ స్పీకర్, ఆర్థిక మంత్రిత్వ శాఖపై దృష్టి పెట్టినట్లు, జేడీయూ రైల్వే మంత్రిత్వ శాఖ, జేడీఎస్ వ్యవసాయ శాఖను డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఎన్నికల ఫలితాలపై ఎన్సీపీ భేటీ
మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ పనితీరును సమీక్షించేందుకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం ముంబయిలోని అధికారిక నివాసంలో ఈ భేటీని నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, పార్టీ పనితీరుపై చర్చించారు. ఈ సమావేశానికి అజిత్ పవార్‌తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నేతలు, మంత్రులు హాజరయ్యారు.
మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం- మిత్ర దేశాల అగ్ర నేతలకు ఆహ్వానం