Bima Sakhi Yojana In Telugu : దేశంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారత జీవిత బీమా సంస్థ- ఎల్ఐసీ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా పదో తరగతి చదివిన మహిళలు కూడా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఆ పథకం పేరే 'బీమా సఖి యోజన'. ఈ స్కీమ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ హరియాణాలోని పానీపత్‌లో సోమవారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఎల్ఐసీ 'బీమా సఖి యోజన' ద్వారా ఉద్యోగం పొందడానికి గల విద్యార్హత, వయోపరిమితి, సాలరీ తదితర వివరాలు తెలుసుకుందాం.
పది చదివితే చాలు!
ఎల్ఐసీ 'బీమా సఖి యోజన' ద్వారా రాబోయే మూడేళ్లలో 2 లక్షల మంది మహిళా బీమా ఏజెంట్లను నియమించాలన్నది ప్రణాళిక. పదో తరగతి ఉత్తీర్ణుతులైన 18-70 ఏళ్ల వయసు గల మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడానికి ఈ స్కీమ్‌ను ఎల్ఐసీ తీసుకొచ్చింది. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, ఆర్థిక అక్షరాస్యత, బీమాపై అవగాహనను కల్పించడమే ఈ పథకం ప్రాథమిక లక్ష్యం.
మూడేళ్లు శిక్షణ, స్టైఫండ్
బీమా సఖులుగా నియమితులైన మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇచ్చి ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడం సహా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. బీమా సఖీలకు మొదటి మూడేళ్లు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఆ సమయంలో నెలవారీ స్టైఫండ్‌ను కూడా ఇస్తారు. మొదటి ఏడాది నెలకు రూ.7,000, రెండో ఏట రూ.6,000, మూడో ఏడాది రూ.5,000 పొందొచ్చు. అలాగే బీమా శాఖలు కూడా వారికి బెనిఫిట్స్ అందిస్తాయి.
ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు అవకాశాలు!
మూడేళ్ల శిక్షణ తర్వాత బీమా సఖులు ఎల్‌ఐసీ ఏజెంట్లుగా పనిచేయవచ్చు. అలాగే గ్రాడ్యుయేట్ స్థాయి బీమా సఖీలు ఎల్‌ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా కూడా అవకాశం పొందుతారు. 18 - 70 ఏళ్ల మధ్య వయసున్నవారు బీమా సఖి ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్హత పదో తరగతి.
'డబుల్ ఇంజిన్ సర్కార్- రెట్టింపు వేగంతో పని'
హరియాణాలోని పానీపత్‌లో 'బీమా సఖి యోజన' ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. హరియాణాలో డబుల్ ఇంజిన్ సర్కార్ రెట్టింపు వేగంతో పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. బీమా సఖి యోజన అందరికీ బీమా లక్ష్యాన్ని చేరుకోవడానికి సాయపడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 1.15 కోట్ల మంది మహిళలు లఖ్ పతి దీదీలు అయ్యారని, ఆ సంఖ్య 3 కోట్లకు చేరుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.