Bibhav Kumar Bail Plea Rejected : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ బెయిల్ పిటిషన్‌ను సోమవారం దిల్లీ కోర్టు కొట్టివేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గౌరవ్ గోయల్ తిరస్కరించారు. బిభవ్ కుమార్ జైల్లో ఉన్నా కూడా స్వాతికి బెదిరింపులు వస్తున్నాయని విచారణ సందర్భంగా ఎంపీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా బిభవ్ అమాయకత్వాన్ని ప్రశ్నించారు. బిభవ్ కుమార్ తన ఫోన్‌ను ఫార్మాట్ చేశారని, స్వాతిపై దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని తొలగించారని ఆరోపించారు.
ఈ క్రమంలో స్వాతి సీఎం నివాసంలోకి అనుమతి లేకుండా వెళ్లలేదని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ కోర్టుకు తెలిపారు. బాధ్యతల నుంచి బిభవ్‌ను తప్పించినా అతడు చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని అతుల్ చెప్పారు. అయితే తమ క్లయింట్ బెయిల్ కోసం ట్రిపుల్ టెస్ట్‌ను పూర్తి చేశారని, అతడు సాక్ష్యాలను తారుమారు చేసే లేదా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదంటూ బెయిల్ అభ్యర్థించారు బిభవ్ తరఫు న్యాయవాదులు.
కన్నీళ్లు పెట్టుకున్న స్వాతి మాలీవాల్
అయితే బిభవ్ కుమార్‌ను విడుదల చేస్తే తన ప్రాణాలకు ముప్పు ఉందని, తన కుటుంబానికి చాలా ప్రమాదకరమని విచారణ సందర్భంగా స్వాతి కోర్టుకు తెలిపారు. ఒక దశలో స్వాతి మాలీవాల్ కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాదు ఓ యూట్యూబర్ కారణంగా తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు.
వాదనల సందర్భంగా బిభవ్ కుమార్ లాయర్ పలు విషయాలు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి నివాసంలో సీసీ కెమెరాలు లేని ప్రదేశాన్ని ఎంచుకుని, అక్కడే దాడి జరిగినట్లు మహిళా ఎంపీ చెబుతున్నారని ఆరోపించారు. అక్కడ రికార్డింగ్ సాధనాలు లేవన్న విషయం ఆమెకు తెలుసునన్నారు. మే 13న ఆమె సీఎం ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం అతిక్రమణే అని కోర్టుకు తెలియజేశారు. ఎంపీ అయినంత మాత్రాన ముఖ్యమంత్రి ఇంట్లోకి ఆ రకంగా ప్రవేశించే అనుమతి ఇచ్చినట్లు కాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె సమస్యలు సృష్టించారని చెప్పారు. ఈ ఆరోపణలను విన్న మాలీవాల్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు.
బిభవ్ హైకోర్టుకు వెళతారు : ఆప్
బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్ కొట్టివేతపై ఆప్ స్పందించింది. దీన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేస్తారని ఓ ప్రకటనలో తెలిపింది.