Bharat Ratna Karpoori Thakur : వెనకబడిన వర్గాల నాయకుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్పూరి ఠాకూర్ శతజయంతి వేళ ఆయనకు కేంద్రం భారతరత్నను ప్రకటించింది. 1924 జనవరి 24న బిహార్‌లోని సమస్తీపుర్ జిల్లాలో కర్పూరి ఠాకూర్ జన్మించారు. డిసెంబర్ 1970 నుంచి జూన్ 1971 వరకు బిహార్ సీఎంగా సేవలు అందించారు. ఆ తర్వాత డిసెంబర్ 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు మరోసారి బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. భారతీయ క్రాంతిదళ్, జనతా పార్టీల్లో సేవలందించారు. జననేత జననాయక్‌గా ప్రసిద్ధి చెందిన కర్పూరి ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు.
బ్రిటిష్ ఇండియాలోని బిహార్-ఒడిశా ప్రావిన్స్‌లోని పితౌజియా (ప్రస్తుతం కర్పూరిగ్రామ్)లో అతి సామాన్య కుటుంబంలో కర్పూరి ఠాకూర్ జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి 26 నెలల పాటు జైలుకు వెళ్లారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తన గ్రామంలో ఉపాధ్యాయుడిగా సేవలందించి ప్రజలను చైతన్యపరిచారు. ఆ తర్వాత జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్‌పుర్ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచి శాసససభలో అడుగుపెట్టారు. బిహార్‌కు మంత్రిగా ఉన్న సమయంలో మెట్రిక్యులేషన్‌లో ఆంగ్లాన్ని తప్పనిసరి సబ్జెక్టు జాబితా నుంచి తొలగించారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేయడంతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో అనేక విద్యాసంస్థలు ఏర్పాటు చేసి విద్యా వికాసానికి కృషిచేశారు.
తొలుత గాంధీజీ ఆలోచనల్ని ప్రచారం చేసినప్పటికీ ఆ తర్వాత సైద్ధాంతికంగా ఆయనతో విభేదించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పనిచేశారు. రామ్‌మనోహర్ లోహియా స్థాపించిన సంయుక్త సోషలిస్టు పార్టీకి అధ్యక్షుడిగానూ చాలా కాలం పాటు ఠాకూర్ పనిచేశారు. దేశంలో భూస్వాముల వద్ద, ప్రభుత్వ ఆధీనంలోని భూముల్ని పేదలకు పంచడం ద్వారా సామాజిక, ఆర్థిక సమానత్వం సాధిస్తుందని తద్వారా దేశం పురోగమిస్తుందని విశ్వసించారు. జనం కోసం నిబద్ధతతో పనిచేసిన ఆయన్ను 'జననాయక్ కర్పూరి ఠాకూర్' అని అక్కడి ప్రజలు పిలుస్తారు.
లాలూ, నీతీశ్‌లకు గురువు
జయప్రకాశ్ నారాయణ్‌కు సన్నిహితుడిగా ఉన్న ఠాకూర్ ఆ తర్వాత జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. అగ్రకులాలు మాత్రమే రాజకీయ ఆధిపత్యం వహించే బిహార్‌లో ఓబీసీ రాజకీయాలకు పునాది వేసిన వారిలో అగ్రగణ్యులు. జేపీ ఇచ్చిన పిలుపుతో ఎంతోమంది యువత ఉద్యమంలోకి రాగా అలా వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్, రాం విలాస్ పాసవాన్ వంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు. బిహార్‌లో ఓబీసీలతో పాటు ఎంబీసీలూ ఎదగాలని ఆయన భావించారు. దళితులు, ఎంబీసీలు, ముస్లింల హితం కోసం పనిచేశారు. తాను విశ్వసించిన సిద్ధాంతాలకు కట్టుబడి సుదీర్ఘకాలం పాటు బిహార్, దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపుపొందారు.
మోదీ సహా పలువురు ప్రముఖల హర్షం
కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడంపై ప్రధాని మోదీ సహా బిహార్ సీఎం నీతీశ్ కుమార్, వివిధ పార్టీల నేతల స్పందించారు.'సామాజిక న్యాయం మార్గదర్శి, జననాయక్ కర్పూరి ఠాకూర్ శత జయంతి వేళ ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేయాలని నిర్ణయించడం నాకు చాలా ఆనందంగా ఉంది.' అని మోదీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు.
నీతీశ్ హర్షం
కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడంపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ హర్షం చేస్తారు. 'ఈ పురస్కారం సమాజంలోని అణగారిన వర్గాలకు సానుకూల సందేశాన్ని పంపుతుంది. కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నా. కర్పూరి ఠాకూర్ 100వ జయంతి సందర్భంగా వెలువడిన ప్రకటన నాకు చాలా సంతోషాన్నిచ్చింది.' అని నీతీశ్ ట్వీట్ చేశారు. మరోవైపు, కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడంపై బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ స్పందించారు. కర్పూరి ఠాకూర్ తన జీవితమంతా పేదప్రజల కోసమే పోరాడడని అన్నారు. ' కర్పూరి ఠాకూర్ తన జీవితం పేదల కోసం అంకితం చేశారు. కర్పూరి ఠాకూర్ కలలను నెరవేర్చేది ప్రధాని మోదీ మాత్రమే.' సుశీల్ మోదీ తెలిపారు.