Bengal Governor Molestation Issue : బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల ఆంశం కీలక మలుపు తిరిగింది. అన్నట్టుగానే, వేధింపుల అంశానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని 100మంది పౌరులకు చూపించారు ఆనంద్ బోస్. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం గురువారం ఉదయం జరిగింది.
ఈ అంశానికి సంబంధించి రాజ్‌భవన్ బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని 'రాజకీయ నాయకురాలు మమతా బెనర్జీ', 'ఆమె పోలీసులు'కు తప్ప 100మందికి చూపిస్తామని ప్రకటించింది. 'సీసీటీవీ ఫుటేజీని తమకు ఇవ్వడం లేదని పోలీసులు కల్పిత ఆరోపణలు చేశారు. వారిది చట్టవిరుద్ధమైన విచారణ. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆనంద్ బోస్ 'సచ్ కే సామ్నే' అనే కార్యక్రమాన్ని చేపట్టారు.' అని రాజ్‌భవన్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఈ మేరకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే కావాలనుకునే వారు ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా తమ అభ్యర్థనలు పంపాలని కోరింది. మొదటి 100 మంది వ్యక్తులకు మాత్రమే గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో ఫుటేజీని చూడటానికి అనుమతి ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉండగా, లైంగిక ఆరోపణలు నేపథ్యంలో సంబంధిత సీసీటీవీ ఫుటేజీని పంచుకోవాలని పోలీసులు రాజ్‌భవన్‌ను కోరారు. అయితే ఈ విషయంలో పోలీసులకు సహకరించవద్దని గవర్నర్ తన సిబ్బందిని ఆదేశించారు.
ఇదీ జరిగింది!
ఇటీవల బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తనను వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. కోల్‌కతా రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై గవర్నర్ బోస్ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ సందర్భాల్లో వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది. ఇక దీనిపై స్పందించేందుకు పోలీసులు ఆసక్తి చూపలేదు.
'సత్యం గెలుస్తుంది'
ఈ ఆరోపణలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ స్పందించారు. సత్యం గెలుస్తందని అన్నారు. కల్పిత కథనాలను చూసి తాను ఎప్పుడూ భయపడనని చెప్పారు. 'ఇలా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఎవరైనా కోరుకుంటే, గాడ్ బ్లెస్ దెమ్. కానీ, బంగాల్లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఆపలేరు' అని బోస్ చెప్పారు.