Arvind Kejriwal Tihar Jail : దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ తిహాడ్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు జైలు అధికారులు ఆయన్ను విడుదల చేశారు. కేజ్రీవాల్ బెయిల్ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు జైలు ముందు ఆయనకు వెల్కమ్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వర్షం పడుతుండగా కారులో జైలు బయటకు వచ్చిన కేజ్రీవాల్‌కు, అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ నేత మనీశ్ సిసోదియా తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, తాను రిలీజ్ కావాలని కోరుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జైళ్లు తనను బలహీన పరచలేవని, తనను జైల్లో వేయడం వల్ల, తన కరేజ్ 100 రెట్లు పెరిగిందని అన్నారు. అనంతరం అధికార పక్షంపై మండిపడ్డారు.
#WATCH | After being released from Tihar Jail, Delhi CM and AAP national convener Arvind Kejriwal says, " today i want to say that i have come out of jail and my courage has increased 100 times...the walls of their jail cannot weaken the courage of kejriwal...i will pray to god to… pic.twitter.com/AXfgtAYH81
— ANI (@ANI) September 13, 2024
"ఇంత వర్షంలోనూ పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా జీవితం దేశానికే అంకితం. జీవితంలో ఎన్నో పోరాటాలు, కష్టాలు ఎదుర్కొన్నా. కానీ సత్యమార్గంలోనే నడిచాను. అందుకే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను జైలులో పెట్టి మనో ధైర్యాన్ని దెబ్బతీద్దామని కొందరు అనుకున్నారు. నేను జైలు నుంచి బయటకు వచ్చాక నా ధైర్యం 100 రెట్లు పెరిగింది. భగవంతుడు చూపిన మార్గంలోనే నడుస్తూ, దేశానికి సేవ చేస్తూనే ఉంటాను. దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించే శక్తులపై పోరాటం కొనసాగిస్తాను" అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు, బెయిల్ పిటిషన్‌పై విచారించిన సుప్రీం, కేజ్రీవాల్‌కు భారీ ఊరటనిచ్చింది. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల బెయిల్ బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత దిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయం వెలుపల సందడి వాతావరణం నెలకొంది. సునీతా కేజ్రీవాల్, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతంర సీఎంకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిని సునీతా కేజ్రీవాల్, బీజేపీ ప్రణాళికలు విఫలమయ్యాయనన్నారు. వారు అధికారంలో ఉండటానికి ప్రతిపక్ష నాయకులను కటకటాల వెనక్కి నెడుతున్నారని ఆరోపించారు. ఇక ఈ బెయిల్ తమ పార్టీకి పెద్ద విజయంగా, నియంతృత్వానికి లాస్‌గా దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అభివర్ణించారు.
కేజ్రీవాల్‌కు వచ్చింది బెయిల్ మాత్రమే : కాంగ్రెస్
ఇదిలా ఉండగా, దిల్లీ మద్యం వ్యవహారంలో కేజ్రీవాల్‌కు కేవలం బెయిల్ మాత్రమే వచ్చిందని కాంగ్రెస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు, సుప్రీం కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ శర్మ వ్యాఖ్యానించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో అశోక్ శర్మ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.