Arvind Kejriwal ED Summons : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఫిబ్రవరి 19న విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. కేజ్రీవాల్‌కు ఇప్పటికే ఐదు సార్లు ఈడీ సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో తమ ఎదుట హాజరు కావాలని దర్యాప్తు సంస్థ ఆరోసారి బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
దిల్లీ కోర్టులో ఈడీ ఫిర్యాదు
అంతకుముందు ఫిబ్రవరి 2న ఈడీ విచారణకు రావాలని ఐదోసారి సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధంగా ఉన్నాయని చెప్పి విచారణకు గైర్హాజరయ్యారు. సమన్లు జారీ చేసిన ప్రతిసారీ కేజ్రీవాల్ విచారణకు స్పందించటం లేదని ఈడీ దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేజీవాల్ను ఫిబ్రవరి 17న కోర్టు ముందు హాజరు కావాలని చెప్పింది. ఈ విచారణ జరగకముందే ఆరోసారి సమన్లు జారీ చేసింది ఈడీ.
మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు దిల్లీ ముఖ్యమంత్రి అరవిద్ కేజ్రీవాల్‌ను ఇప్పటికే విచారించారు. 2023 ఏప్రిల్‌లో 9 గంటల పాటు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు ఐదుసార్లు సమన్లు జారీ చేశారు. గతేడాది నవంబరు 2, డిసెంబరు 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ ఈ సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను పిలుస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదే కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయ్యారు.
ఇటీవలే మనీలాండరింగ్ కేసులో భాగంగా దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ దాడులు చేసింది. కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ సహా ఆప్‌తో సంబంధం ఉన్న పలువురి ఇళ్లలో ఈడీ సోదాలు జరిపింది.
'ఆడియో రికార్డింగ్స్ డిలీట్ చేశారు'- ఈడీపై ఆప్ సంచలన ఆరోపణలు- దర్యాప్తు సంస్థ ఫైర్
'దిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు'- కేజ్రీ సంచలన ఆరోపణలు